నకిరేకల్, ఏప్రిల్ 28 : ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో గల సాయి మందిరం 18వ వార్షికోత్సవం, శ్రీ జ్ఞాన సరస్వతి దశమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు వనమా వెంకటేశ్వర్లు, యాట మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా మందిర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
29వ తేదీ ఉదయం 5:15 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు శ్రీ మహాగణపతి పూజ, మండపారాధన, 30వ తేదీన సాయినాధుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, రాత్రి 7 గంటలకు సాయినాధుడి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా వారు కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి ఉప్పల వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బండారు వేణుగోపాల్, సహాయ కార్యదర్శి తొణుపునూరి రాంబాబు, ఆలయ పూజారి దుర్గి మురళీధర్ శర్మ పాల్గొన్నారు.