సూర్యాపేట టౌన్, అక్టోబర్ 24 : ‘నిరుద్యోగులకు ఉద్యోగావకాశం.. కేవలం 1,800 రూపాయలు చెల్లించి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో వచ్చే యాడ్స్‌ను ప్రతి రోజూ చూస్తే చాలు. మీ అకౌంట్లో రోజూ డబ్బులు వేస్తాం. వాటిని వారానికొకసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. గిప్ట్ అమౌంట్, బోనస్ అమౌంట్‌తో పాటు నెలనెలా జీతం కూడా ఇస్తాం. మా మాట నమ్మండి. కొద్దిరోజుల్లోనే కోటీశ్వర్లు అవ్వచ్చు’ అంటూ మాయ మాటలతో జనం ముందుకు వచ్చిన ఆర్జీఏ సంస్థ కోట్లాది రూపాయలు దండుకున్నది. గత జూలై నెలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అమెరికాకు చెందిన సంస్థగా చెబుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ ఓ వ్యక్తి ఆర్జీఏ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అవగాహన సదస్సులు పెడుతూ వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి రూ.1,800 కట్టించుకోవడమే గాక వారు మరికొంతమందితో డబ్బులు కట్టించేలా జిల్లా కేంద్రానికి చెందిన కొందరిని మధ్యవర్తులుగా పెట్టుకున్నాడు. తమ సంస్థలో రూ.1,800 కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి యాప్ ఇచ్చారు. రోజూ 4 నుంచి 5 యాడ్స్‌ను పంపిస్తూ వాటిని చూసిన వారికి రోజూ 60 రూపాయలను యాప్‌లో జమ చేశారు. ఇలా 1,800 కడితే రోజుకు రూ.60, 4,500 కడితే 260, 15వేలు కడితే 540, 45వేలు కడితే 1,620, లక్షా 20వేలు కడితే 4,650 రూపాయలు అంటూ వసూలు చేశారు. చైన్ లింక్‌లో ఒక వ్యక్తి కింద 400 మంది సభ్యులు చేరితే వారికి లక్ష రూపాయల వేతనంతోపాటు సమావేశాలను ఏర్పాటుచేసుకునేందుకు అయ్యే ఖర్చులు ఇస్తూ వచ్చారు. ఇలా డబ్బులు వస్తుండడంతో అందులో చేరిన వారు తమకు తెలిసిన ప్రతి ఒక్కరినీ మోటివేట్ చేసి డబ్బులు కట్టించారు. వారు కూడా ఉన్నవి అమ్ముకుని మరీ లక్షల్లో పెట్టుబడి పెట్టారు.
మరికొందరు తమ బంధువులు, తెలిసిన వారికి మీ డబ్బుకు మాది గ్యారంటీ అంటూ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి లక్షల్లో డబ్బు పెట్టించారు. యాప్‌లో వచ్చిన డబ్బులను సైతం మళ్లీ యాప్‌లోనే పెట్టుబడి పెట్టడంతో భారీగా మోసపోయారు. ఇలా జమ అయిన మొత్తాన్ని వారంలో ఒక రోజు బుధవారం విత్‌డ్రా పెట్టుకునే అవకాశాన్ని కల్పించగా నిన్న బుధవారం విత్‌డ్రా అప్షన్ కనిపించకలేదు. దాంతో యాప్‌లో డబ్బు పెట్టిన వారంతా భయాందోళనకు గురయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఆర్జీఏ బాధితులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించి తాము ఎంత నగదు పెట్టి, ఎలా మోసం పోయింది వివరిస్తున్నారు. దాంతో పోలీసులు సదరు మోటివేటర్స్ను స్టేషన్‌కు తీసుకొచ్చి ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలిసింది.
ఆరు లక్షలు మోసపోయాను
నేను మొదటి ఆర్జీఏ సంస్థను నమ్మలేదు. నా వద్దకు ఓ వ్యక్తి వచ్చి బాగా డబ్బులు వస్తాయని నమ్మించాడు. ఈ నెల 17న ముందు నేను మీ పేరున 15వేలు కడుతున్నాను.. తరువాత నాకు ఇద్దూలే అన్నాడు. యాప్‌లో డబ్బులు పడ్డాయి చూడు అని చూపెట్టి బుధవారం డ్రా చేసుకొవచ్చని చెప్పాడు. దాంతో నమ్మి నేను, నాకు తెలిసిన వారి నుంచి రూ.6లక్షల వరకు కట్టించాను. వారి డబ్బుకు నాది బాధ్యతని ప్రామిసరీ నోట్లు రాసిచ్చాను. పోలీసులు విచారణ చేసి మా డబ్బులు ఇప్పించాలి.
– కోనం యాదగిరి, ఇంద్రియాల గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా
2 లక్షల రూపాయలు కట్టాం
ఆర్జీఏలో చేరమని నాకు తెలిసిన వారు వెంట పడడంతో 45 వేల రూపాయలు కట్టాను. తరువాత నా కుటుంబ సభ్యులతో రూ.2లక్షల వరకు పెట్టించాను. పని చేసే వద్ద ఆఫీస్ స్టాఫ్‌నూ జాయిన్ చేయించాను. బుధవారం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విత్‌డ్రా ఆప్షన్ కనిపించ లేదు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సంస్థ ఎత్తేసినట్లు తెలిసింది. ఆర్జీఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను.
-ఆడోతు నాగరాజు, మిర్యాలగూడెం