– తెల్లారేకల్లా వెలసిన డబ్బా కొట్టు
– తొలగించాలని కమిషనర్, చైర్పర్సన్కు ఫిర్యాదు
కోదాడ, మే 05 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులోని యాదవ నగర్లో తెల్లారేకల్లా మున్సిపాలిటీ స్థలంలో భారీ డబ్బా కొట్టు వెలసింది. ఆ వార్డుకు చెందిన ఓ నాయకుడు ప్రమేయంతోనే ఈ నిర్వాకం జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కోదాడ ప్రధాన రహదారి పక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణకు, టెలికాం కార్యాలయం ప్రహరీకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కొందరు ఇష్టారాజ్యంగా డబ్బా కోట్లు ఏర్పాటు చేసుకుని అద్దెలకు ఇవ్వడం అందరికీ తెలిసిందే. మున్సిపాలిటీ స్థలాలను ఇలా ఆక్రమించుకుని దాదాపు 150 నుంచి 200 బడ్డీ కోట్లు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధులకు ఇరువైపులా కాల్వలపై కూడా చిన్న చిన్న బడ్డీ కొట్లు నిర్వహిస్తున్నారు. గతంలో సదరు బడ్డి కొట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయి తప్పితే తొలగించలేదు. ఈ పరిణామంలో తాజాగా 32వ వార్డులో మున్సిపాలిటీ వాహనాలు నిలిచే స్థలంలో ఓ భారీ డబ్బా కొట్టు వేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ఆ వార్డు ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
32వ వార్డులో మున్సిపాలిటీ వాహనాలు నిలిచే స్థలాన్ని కబ్జా చేసి అందులో ఏర్పాటు చేసిన బడ్డీ కొట్టును తక్షణమే తొలగించాలి. గతంలో సదరు మున్సిపల్ స్థలంలో గ్రంథాలయం నిర్వహించారని, అది శిథిలం కావడంతో చదును చేసి మున్సిపాలిటీ వాహనాలు నిలిచేందుకు వినియోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ వార్డులోని ఓ నాయకుడు అక్రమంగా బడ్డి కొట్టును ఏర్పాటు చేసుకుని అద్దెకించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. తక్షణమే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ జోక్యం చేసుకుని సదరు బడ్డీ కొట్టును తొలగించి మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.