చివ్వెంల, ఏప్రిల్ 01 : పోరాటాలు తమకు కొత్త కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని బండమీదిచందుపట్ల నుండి హెచ్సీయూ ఎదుట ధర్నాకు బయల్దేరుతున్న తెలంగాణ యువజన సంఘం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ చర్యను వారు తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీ విద్యార్థుల మీద, విద్యార్థి సంఘం నాయకుల మీద పోలీసుల నిర్భందాన్ని ఆపాలన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే స్పందించాలని కోరారు. విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పంపి విద్యార్థులను చితకబాది భయబ్రాంతులకు గురిచేయడం అమానుషం అన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని కోరారు. వారి వెంట రాష్ట్ర నాయకుడు భాషపంగి సునీల్, ఏర్పుల అమ్మయ్య, మధు, వరుణ్ ఉన్నారు.