కట్టంగూర్, మార్చి 27 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేదని వీఓఏల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షురాలు పొడిచేటి సులోచన అన్నారు. వీఓఏల అక్రమ అరెస్టులను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలను పరిశీలించాలని వీఓఏలు నిరసన కార్యక్రమం చేపడితే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రశ్నించే హక్కులను కాలరాసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ప్రజా పాలనా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు సమస్యలు పరిష్కరించకుండా పోరాటాలను ఆపడం ఏంటని ఆమె ప్రశ్నించారు. వీఓఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారిని సీసీలుగా ప్రమోషన్లు కల్పించి గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వేతనాలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, జాల రమేశ్, బండ నాగమణి, కంచర్ల సుజాత,నూనె శోభారాణి, లలిత, శైలజ, సరిత, ఉమ, నందిని, మమత, రేణుక, సాయి పాల్గొన్నారు.