మోత్కూరు, మార్చి 9 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే.. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ జోకర్ చేష్టలు చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని దత్తప్పగూడెంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ను, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిని తిడుతున్నారన్నారు.
తల్లి లాంటి బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను తిట్టడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్యే సామేల్, ఆయన కొడుకులు కమీషన్లకు ఎగబడి నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపడేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తీసుకొచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే సామేల్ తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి చూపెట్టాలని సవాల్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిల్లులు పాస్ చేయడానికి 20 శాతం కమీషన్లు తీసుకుంటుంటే తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామేల్ కమీషన్లకు తట్టుకోలేక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని అన్నారు.
అందుకు నియోజకవర్గంలో ఆగిపోయిన పనులే నిదర్శనమని పేర్కొన్నా రు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బిక్కేరు వాగులోకి వదిలిన కాళేశ్వరం జలాలకు పూలు చల్లి పూజలు చేస్తున్నారని తెలిపారు. దోసెడు ఇసుకను పోనివ్వనని ఎన్నికల్లో చెప్పిన ఎమ్మెల్యే సామేల్.. ఇప్పుడు తన కొడుకులతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని విమర్శించారు. మోత్కూరు మున్సిపాలిటీ, సింగిల్‌విండో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి సాధించిందేమిటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన రూ.10 కోట్లతోనే సీసీ రోడ్లు, ఇతర పనులు జరిగాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే మోత్కూరు మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు చేయించాలని సవాల్ చేశారు. సింగిల్‌విండోలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినవారు నేటికీ ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. సింగిల్‌విండోలో ఉన్న నిధులన్నీ చిరు వ్యాపారుల పేరిట కాంగ్రెస్ కార్యకర్తలకు రుణాలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఇన్స్టాల్మెంట్ చేయించలేదన్నారు. రెండు గదుల రిపేరుకు రూ.12లక్షల బిల్లులు చేసింది బయట పెడ్తామన్నారు.
తాము సాధారణ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ.50వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న కాంగ్రెస్ చైర్మన్ సంవత్సరంలోనే రూ.5లక్షల ఖర్చులు చూపెట్టారని తెలిపారు. రైతుల సొమ్మును దుబారా చేసి సంఘాన్ని ఆగం చేస్తే సహించబోమని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, సహకార సంఘం డైరెక్టర్లు సామ పద్మారెడ్డి, దేవసరి రాము లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేందర్నాథ్, నాయకులు నాగయ్య, కొండ సోంమల్లు, మల్లేశ్, నర్సయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.