తాను గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను… నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు… నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే… ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేది లేదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తున్నది.
సూర్యాపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తుం గతుర్తి ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలతో పొసగటంలేదు. నెలకోసారి సొంత పార్టీ నేతలే తూర్పారబడుతున్నారు. కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే కుటుంబమే చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదు… ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు తరచూ ఆరోపిస్తున్నారు. ఇసుక విషయంలో తట్టెడు కూడా ఎత్తనివ్వనని ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేసి.. నేడు ఆయన కుమారులతో దందా నడిపిస్తున్నారని కాం గ్రెస్ నాయకులు వీడియోలు సహా గతంలో బహిరంగపరిచారు.
శాలిగౌరారం మండలానికి చెందిన వ్యక్తిని పోలీసులకు చెప్పి చితక బాదించిన ఎమ్మె ల్యే తీరుతో నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అప్పట్లో సంచలనం సృష్టించింది. అర్వపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత యోగానందాచార్యులు నేతృత్వంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం తలపెట్టడం…ఆ వెంటనే అర్ధరాత్రి సొంత పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయించడంపై నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు చర్చనీయాంశమైంది. వీటికి తోడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మోత్కూరులో వేలాది మందితో నిర్వహించిన సభతో తుంగతుర్తి కాంగ్రెస్ కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి.
అడ్డగూడూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గూడెపు నాగరాజు పేరిట తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసినట్లుగా నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు చెక్కర్లు కొట్టాయి. ఇలా అనేకసార్లు తుంగతుర్తి కాంగ్రెస్‌లో కుమ్ములాటలు… ఎమ్మెల్యే సామేల్‌పై ఆరోపణలు వస్తుండగా తాజాగా ఎమ్మెల్యే సామెల్ మరో వివాదంలో ఇరుక్కోవడం గమనా ర్హం. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మె ల్యే మామూళ్లు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అర్థం అవుతున్నది.
ఎమ్మెల్యే సామేల్‌తో బేరసారాలాడుతూ లిక్కర్ మాఫియా స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే మామూళ్ల వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని ప్రచారం. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదంటూ తనకు రోజుకూ రూ.లక్ష ఖర్చు వస్తుంది డీజిల్‌కు కూడా డబ్బులు లేవు ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడంలేదు.. మీరిచ్చే మామూళ్లు నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు అంటూ.. తన మాట వినని వారి సంగతి చూస్తా అని వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే సామే ల్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతల చేతికి చిక్కడంతో ఎమ్మెల్యే సామేల్ వసూళ్ల వ్యవహారం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
అసత్య ఆరోపణలు చేసిన వారిని వదలను
లిక్కర్ దందాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వీడియో తీసిన వ్యక్తులపై విచారణ జరిపించాలని తుంగతుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితుడని ఓర్వలేక కొంతమంది కావాలనే కుట్ర చేశారని పేర్కొన్నారు. నా ఇంట్లోకి వచ్చి టీ తాగి ఇంకా వీడియోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అలాంటి వారిని చట్టపరంగా విచారణ జరిపి దోషులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చిల్లర దందాలకు పాల్పడే వ్యక్తి మందుల సామేల్ కాదన్నారు.