చందంపేట (దేవరకొండ), 23 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరారు. దేవరకొండలో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ యువతను మోసగించిన పార్టీలేనన్నారు. యువతలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కవని పేర్కొన్నారు.
బీజేపీ అభ్యర్థి పోటీలో ఉన్నా ప్రజల్లో మాత్రం లేనట్లేనని, ఎన్నికల్లో మాత్రమే కనిపించి ఆ తర్వాత కనపడరని ఎద్దేవా చేశారు. విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం దెబ్బతిన్నదన్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మాయ మాటలకు మోసపోకుండా ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని యువతను కోరారు. సమావేశంలో డిండి ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్రావు, పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా పర్వత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నాయకులు దస్రూనాయక్, చంద్రశేఖర్‌రెడ్డి, వల్లపురెడ్డి, తిరుపతయ్య, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.