యాదగిరిగుట్ట, జూన్ 28: ‘ఏయ్ నీకు మెంటలా..పిచ్చా.., ‘ఏ ఊరు నీది.. నీ సంగతి చెప్త్తా’ ‘ఎమ్మెల్యేతో వాదిస్తున్నావేంటి?’ రోజూ ఏం కూరలు వండుతున్నారు.. రోజూ దోసకాయ కూరనే పెడుతున్నారట ఎందుకు.. అంటూ ప్రభు త్వ పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలు రాధికపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దురుసుగా వ్యవహరించిన తీరు ఇది. ఎమ్మెల్యే ప్రవర్తనతో ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థంకాక ఆమె ఏడుస్తూ ‘నమస్తే తెలంగాణ’తో తన గోడును వెళ్లబోసుకున్నది.
శనివారం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన విద్యార్థులతో మాట్లడుతూ ఏదైన సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని ఫిర్యాదు చేశారు. వెం టనే ఆయన వంటశాలకు వెళ్లి అన్నం, కూరలను పరిశీలించా రు. రోజువారి మెనూ ప్రకారం వంటలు వండుతున్నారా లేదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనంలో మిక్స్డ్ కూరగాయలతోపాటు పాలకూర పప్పు విద్యార్థులకు పెడుతున్నామని తాను చెప్పానని రాధిక వివరించింది. విద్యార్థులంతా భోజనం చేసి తిరిగి తరగతులకు వెళ్తున్న సమయంలో వంటపని వారితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారని, వంటల ఇన్చార్జి ఎవరంటూ ప్రశ్నించగా తాను ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని రాధిక పేర్కొన్నారు. రోజూ దోసకాయ కూరనే పెడుతున్నారట ఎందుకూ అని తనను ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించారన్నారు.
అలా కాదు సార్.. ఈ రోజు మె నూ ప్రకారం మిక్స్డ్ కూరగాయలు, దోసకాయ బీరకాయ, పాలకూర పప్పు ఇచ్చామని ఎమ్మెల్యేకు చెప్పానన్నారు. ఇక్కడ దోసకాయ కూర ఒక్కటే ఉంది కదా.. అంటూ గట్టిగా అరుస్తూ ఎమ్మెల్యే ఊగిపోయాడన్నారు. కాదు సార్ మెనూ ప్రకారమే భోజనం అందజేస్తున్నామనిచెప్పినా పట్టించుకోకుండా నా ముందే గట్టిగా వాదిస్తున్నావ్, ఎమ్మెల్యే ముందే ఇట్లనేనా మా ట్లాడేది అంటూ ఏయ్.. నీకు మెంటలా పిచ్చా ..అంటూ దూషించారన్నారు.
దీంతో తాను ఆయనను అడ్డుకొని ఏంటి సార్.. మెంటలా.. పిచ్చా అంటున్నారేంటి సార్ అని అడుగుతున్నా ఆయన ఏయ్ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ పలుమార్లు పరుష పదజాలం వాడి తనను దూషించారని ఉపాధ్యాయురాలు రాధిక ఆవేదనతో చెప్పింది. ఎమ్మెల్యే హోదాలో ఉండి మహిళా ఉపాధ్యాయురాలిపై ఇలా దురుసుగా, పరుషపదజాలం ఉపయోగించడం సరి కాదని ఉపాధ్యాయ సం ఘాల నాయకులు మండిపడ్డారు. దీనిపై త్వరలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. వెంటనే ఎమ్మెల్యే ఉపాధ్యాయురాలికి క్షమాపణ చెప్పాలని మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే..
మెనూ ప్రకారమే భోజనం పెడతామని, ఉపాధ్యాయురా లు రాధిక ఇచ్చిన సమాధానంతో అవమానంగా భావించిన బీర్ల అయిలయ్య అక్కడే ఉన్న ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ఎంఈవో శరత్యామినితో జరిగిన విషయాన్ని వివరించారు. వెంటనే ఫోన్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయురాలు రాధికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రవర్తనతో విసిగిన ఉపాధ్యాయురాలు రాధిక ఎమ్మెల్యేకు ధీటుగానే సమాధానం ఇచ్చినట్లు అక్కడే ఉన్న కొంత మంది విద్యార్థులు తెలిపారు.
విచారణకు ఆదేశించాం
ఉపాధ్యాయురాలు రాధిక, ఎమ్మెల్యే మధ్య జరిగి వాగ్వాదం మా దృష్టికి వచ్చింది. దీనిపై యాదగిరిగుట్ట మండల విద్యాధికారితో విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నా. రాగానే సమస్యలపై దృష్టి పెడతాం.
– సత్యనారాయణ, జిల్లా విద్యాధికారి, యాదాద్రి భువనగిరి