మేజర్ పంచాయతీ అయిన కొండమడుగు గ్రామ పంచాయతీ హైదరాబాద్ నగర సమీపంలోని ఓ శివారు గ్రామం. గ్రామ జనాభా ఆరువేలకు పైగానే ఉంటుంది. నగరానికి సమీపంలో ఉండటంతో అభివృద్ధి కూడా శరవేగంగానే జరుగుతోంది. పంచాయతీ ఆదాయం సుమారుగా రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. అయితే గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 93 లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు డీపీవో విచారణలో తేలింది.
ఈ నిధుల్లో రూ. 41 లక్షలు పూర్తిగా దుబారా జరిగింది. మరికొన్నింటికి బిల్లుల్లేవు..ఉన్నా బిల్లు ఒకరిపై చెక్కు డ్రా చేసేది మరొకరు. ఎంబీ రికార్డులు, ఓచర్లు సైతం లేవు. అంతేకాకుండా పంచాయతీ పరిధిలో అనధికార నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. రూ. 41లక్షలు దుబారా అంటే మామూలు విషయం కాదు. పంచాయతీలో ఆడిటింగ్ జరగలేదా..? జరిగితే నిధులు దుర్వినియోగమైన విషయం ఎందుకు బయటపడలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పంచాయతీలో రూ. 93లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు డివిజన్ పంచాయతీ అధికారే విచారణ చేపట్టి విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. మొదటి నుంచీ పంచాయతీలో ఎంబీ రికార్డులు లేవు.. బిల్లులు ఉండవు.. ఓచర్లు సమర్పించరు.. ఉన్నా బిల్లులు ఒకరి పేరు మీద.. చెక్కుల్లో మరొకరి పేరు.. పాత బిల్లులతో డబ్బులు డ్రా.. అనవసర ఖర్చులు.. ఇదీ పంచాయతీ సిబ్బంది పనితీరు. అలాగే అనధికార నిర్మాణాలు అడ్డగోలుగా చేపడుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకుండా కిమ్మనకుండా ఉంటున్నారు.
బీబీనగర్ మండలంలోని కొం డమడుగు మేజర్ గ్రామ పంచాయతీ. సుమారు 6 వేల జనాభా ఉంటుంది. హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాదా పు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల ఆదాయం ఉంటుంది. అయితే అడిషనల్ కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న కొండమడుగు పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి ఆ గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్ కలెక్టర్ గ్రామ పం చాయతీకి వచ్చిన నిధులు, ఖర్చు, నిధులపై విచారణ చేపట్టాలని డీపీవోను ఆదేశించారు. దీంతో భువనగిరి డివిజనల్ పంచాయతీ అధికారి సదరు గ్రామ పంచాయతీకి వెళ్లి విచారణ చేపట్టారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది. సదరు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు డీఎల్పీవో అందజేశారు.
రూ. 41లక్షల దుబారా ఖర్చు..
తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం నిబంధనలు పాటించకుండా వివిధ నిధుల నుంచి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో బిల్లులు, ఓచర్లు, ఎంబీలు లేకుండా రూ. 52 లక్షలు చెల్లించారు. ఇక రూ. 41 లక్షల దుబారా ఖర్చు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇందులో 2022-23లో 20.7లక్షల నిధు లు చెల్లించగా, ఇందులో బిల్లులు, ఓచర్లు, ఎంబీలు లేకుండా రూ. 16.5 లక్షలు చెల్లించగా, రూ. 42 లక్షలు దుబారా ఖర్చు చేశారు.
2023-24లో మొత్తం రూ. 29.4లక్షలు, 2024-25లో రూ. 43 లక్షలు ఖర్చు చేసినట్లు విచారణలో తేలింది. కొన్ని సందర్భాల్లో పాత బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేయడం విశేషం. మస్టర్ రోల్ పంచాయతీ కార్యదర్శి సంతకంతో అటెస్ట్ చేయలేదు. అక్విటెన్స్ రిజిస్టర్ మెయింటెయిన్ చేయలేదు. బిల్లులు, చెక్కులకు సరిపోలడం లేదు. బిల్లులు లేకున్నా కొటేషన్ ఆధారంగా చెక్కులు ఇచ్చారు. కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా గ్రామ పంచాయతీకి ఫర్నిచర్ కొనుగోలు చేశారు.
డబ్బులు రికవరీ అయ్యేనా..?
గతంలో కేసీఆర్ హయాంలో కొత్తగా తెలంగాణ గ్రామ పంచాయతీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే.. సదరు సెక్రటరీ నుంచి రికవరీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. కొండమడుగులో ఏకంగా రూ. 41లక్షలు దుబారా చేయడం అంటే మామూలు విషయం కాదు. పంచాయతీలో ఆడిటింగ్ జరగలేదా..? ఒకవేళ జరిగినా నిధులు దుర్వినియోగమైన విషయం ఎం దుకు బయట పడలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త చట్టం ప్రకారం సదరు బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేస్తారా..? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ పనిచేసిన ఎంపీవో పర్యవేక్షణా లోపం వల్లే దుబారా ఖర్చు జరిగినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినా ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఉన్నతాధికారులు చర్యలకు వెనుకాడినట్లు తెలిసింది.
అక్రమ నిర్మాణాలు..
గ్రామంలో విరాళాల ద్వారా చేపట్టిన కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం విషయంలో నిబంధనలు పాటించలేదని, అధికారుల ఆమోదం పొందలేదని విచారణలో తేలింది. అదే విధంగా వివిధ సర్వే నంబర్లలో అనధికారంగా 25 వరకు పలు నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిల్లో అధిక శాతం కమర్షియల్ నిర్మాణాలే కావ డం విశేషం. వీటికి పంచాయతీ కార్యదర్శి కేవలం నోటీసులు మాత్రమే జా రీ చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదని నివేదికలో పొందుపరిచారు.