పెద్దఅడిశర్లపల్లి/పెద్దవూర, ఆగస్టు 9: జంట నగరాలకు తాగునీరు అందించే సుంకిశాల పథకంలో కూలిన రిటైనింగ్ వాల్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం 2.55గంటలకు హెలికాప్టర్లో సుంకిశాలకు చేరుకున్న వారు 3.03గంటలకు ప్రమాదం జరిగిన పంప్ హౌస్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మెగా కంపెనీ అధికారులు, మెట్రో బోర్డు అధికారులతో మాట్లాడి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.
అనంతం మీడియాతో మాట్లాడి 4.04 గంటల నిమిషాలకు తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. కాగా, పరిశీలన సమయంలో మంత్రి తుమ్మల జల మండలి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఓవర్ ఫ్లో అవుతున్నది.. జూరాల, శ్రీశైలం నిండింది. మనకు వరద వస్తున్నది.. అయినా టన్నెల్ ఎందుకు ఓపెన్ చేశారని ప్రశ్నించా రు. అధికారులు టన్నెల్ ఓపెన్ చేయలేదని చెబూతూనే గేట్ తోసేందని చెప్పుకొచ్చారు. మంత్రి మా త్రం వరద వచ్చినప్పుడు లెవల్స్ చూసుకోవడం, గేట్ తోసి వేయకుండా జాగ్రత్త పడడం అధికారుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు.
అధికారులు మాత్రం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదమూ లేదని, 2, 3 మాసాలు మాత్రమే ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. చివరగా పడిపోయిన గోడ నిర్మాణం డిసెంబర్ ముందు జరిగిందా, డిసెంబర్ తర్వాత జరిగిందా అని అధికారులను మంత్రి నొక్కినొక్కి అడగగా జలమండలి అధికారి తడబడుతూ డిసెంబర్లోనే చెప్పారు. మంత్రుల పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షించారు. నల్లమల్ల అటవీ ప్రాంతానికి అనుకుని ఉండడంతో ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేక ఎస్కార్టు వాహనాలను ఏర్పాటు చేసి భారీగా పోలీసు బలగాలను మోహరించారు.