యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తానని, అది తన ధర్మమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చెక్‌డ్యామ్‌లు మొదలుకుని లిఫ్ట్ ఇరిగేషన్లు, ప్రాజెక్టుల వరకు అన్నీ పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం భువనగిరిలో జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటి పారుదల పనులపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్షించారు.
అంతకుముందు అనాజిపురం శివారులోని బునాదిగాని కాల్వను మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. సమీక్షలో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పూర్తికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామన్నారు. బునాదిగాని కాల్వకు రూ.269 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వకు రూ.86 కోట్లు, ధర్మారెడ్డి కాల్వకు రూ.133 కోట్ల అవసరమన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణను ఎమ్మెల్యేలు పూర్తి చేయాలని కోరారు. భూసేకరణ అనంతరం సంవత్సరంలో పనులు పూర్తి చేయొచ్చన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మూసీ ప్రక్షాళన జరుగుతుందన్నారు. భవిష్యత్త్‌లో భువనగిరి ప్రాంతానికి దేవాదుల నుంచి లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తాయని, దేవాదుల ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యమిచ్చి రెండేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.
దేవాదులకు ప్రాజెక్ట్‌కు 16 ఏండ్ల క్రితం సోనియాగాంధీ శంకుస్థాపన చేశారని, 2026 మార్చి నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోనియా గాంధీతో ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. దేవాదుల ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. 45 రోజుల్లోపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు నిర్మాణానికి శ్రీకారం చుడుతామన్నారు. సమావేశంలో నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, కలెక్టర్ హనుమంతు కే జెండగే, డీసీపీ రాజేశ్చంద్ర, అడిషనల్ కలెక్టర్లు గంగాధర్, బెన్షాలోమ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించి అభివృద్ధి చేయాలని కోరారు. తపాసుపల్లికి నీరు అందిస్తే రాజపేట సస్యశ్యామలం అవుతుందన్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా ఇంకా 20 చెరువులు నింపే అవకాశం ఉందని, ఆ పనులు చేపట్టాలని, యాదగిరిగుట్ట గండి చెరువుకు కూడా నీళ్లు ఇవ్వాలని కోరారు.