బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 28 : సూర్యాపేట పట్టణాభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక రవి కన్వెన్షన్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ సొంతంగా నిధులు సమకూర్చుకుని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు.
పన్నుల విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి పూర్తి స్థాయిలో వసూలు అయ్యేలా చూడాలన్నారు. 1960కి ముందు రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయని ప్రస్తుతం విశాలంగా మారి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయన్నారు. ప్రజలు కూడా తమ ఇండ్ల ముందు ర్యాంపులను కట్టకుండా సెట్‌బ్యాక్ అయి కట్టడాలు చేసుకుంటే రోడ్లు విశాలంగా మారి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పదేళ్ల నాటికి ఇప్పటికి పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పట్టణంలో రెండు మినీ ట్యాంక్బండ్లు, మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు రాష్ర్టానికి తలమానికంగా మారాయన్నారు.
రూ.142 కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం
సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన 2022-23 సంవత్సర సవరణ అంచనా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 142 కోట్ల 2 లక్షల 25 వేల రూపాయల బడ్జెట్‌ను కౌన్సిల్లో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. మున్సిపల్ సాధారణ నిధుల కింద రూ.39.32 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.98.20 కోట్లు రావొచ్చని అంచనా వేయడం జరిగింది. ఇందులో వివిధ పన్నుల రూపంలో రూ.19.24 కోట్లు, ఇతర పన్నులు అద్దెల ద్వారా రూ.20 కోట్ల 8 లక్షల 25 వేలు, రుణాల ద్వారా రూ.3.90 కోట్లు, నాన్ ప్లాన్ నిధుల కింద రూ.19 కోట్లు, ప్లాన్ నిధుల ద్వారా రూ.14.30 కోట్లు, ఇతర నిధులు రూ.65.50 కోట్లు మొత్తం 142 కోట్ల 2 లక్షల 25 వేల రూపాయల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు.
ఈ బడ్జెట్ కింద సిబ్బంది వేతనాలకు రూ.14.50 కోట్లు, పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు రూ.4.66 కోట్లు, విద్యుత్ చార్జీల కింద రూ.3.13 కోట్లు, రుణాల చెల్లింపుకు రూ.2 కోట్లు, మున్సిపల్ గ్రీన్ బడ్జెట్ కింద రూ.3 కోట్ల 93 లక్షల 23 వేలు, ఇంజినీరింగ్ విభాగం నిర్వహణ కోసం రూ.4.26 కోట్లు సాధారణ పరిపాలన వ్యయం కింద రూ.కోటి 68 లక్షల 50 వేలు, పట్టణ ప్రణాళిక విభాగం కోసం రూ.36 లక్షలు, చార్టడ్ వ్యయం కింద రూ.35 కోట్ల 2 లక్షల 73 వేలను చూపించారు. గతంలో మున్సిపల్ బ్యాలెన్స్ నిధులు రూ.కోటి 60 లక్షలు, ప్రజల సౌకర్యాలకు రూ.77 లక్షలు, అభివృద్ధి పనుల కింద రూ.2 కోట్ల 42 లక్షల 52 వేలు మొత్తం రూ.4 కోట్ల 79 లక్షల 52 వేలను అభివృద్ధి వ్యయం కింద చూపించారు. 2023-24 ఖర్చు కింద మొత్తం రూ.39.32 కోట్లు ప్రాధాన్య పరిపాలన నిర్వహణలో భాగంగా, గ్రాంట్ల రూపంలో వచ్చే రూ.98.80 కోట్లు వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అంచనా వేశారు. ఈ బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అనంతరం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలోని 1వ అంశం మినహా మిగిలిన అజెండా అంశాలను కూడా ఆమోదించింది. సమావేశంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.