అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదేని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తే రైతు బంధు రాదని, రైతు బీమా, 24 గంటల కరెంట్ పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవరకొండ ప్రాంతం కరువుకాటకాలతో అల్లాడిందని, కన్నబిడ్డలను అమ్ముకునే పరిస్థితిని నాటి పాలకులు తెచ్చారని దుయ్యబట్టారు. ఏనాడూ ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్య్రక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
దేవరకొండ, నవంబర్ 3 : కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు బంద్ అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆరడుగుల ఎత్తు ఉండి ప్రజల రక్తం తాగారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే రైతుబంధు నాయకుల జేబుల్లోకి వెళ్తుందని, అదే బీఆర్ఎస్ వస్తే రైతుల ఖాతాల్లోకి జమవుతుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు బంధు, బీమా, కేసీఆర్ కిట్టు, అమ్మఒడి పథకాలు అమలవుతున్నాయన్నారు. గత పాలకుల పాలనలో కన్నపిల్లలను అమ్ముకునే సంస్కృతి ఇక్కడ ఉండేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు.
దేవరకొండలో రమావత్ రవీంద్రకుమార్‌కు ఓటేసి నాలుగోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలు ఉండదన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకంతో పేదలందరికీ ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్మిక నాయకుడైన హన్మంత్ చంద్రన్న కుమారుడు వెంకటేశ్‌గౌడ్‌కు సరైన న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్లో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి పోయిన వారిని పట్టించుకోవద్దని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలే మనకు అండగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ వెంకటేశ్‌గౌడ్‌కు పార్టీలో సరైన గౌరవం అందలేదని, వచ్చే రోజుల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో న్యాయం చేస్తామని హామీనిచ్చారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని సూచించారు. దేవరకొండ ఖిల్లాపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రమావత్ రవీంద్రకుమార్ ఎంతో సౌమ్యుడని ఎమ్మెల్యేగా నాలుగోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సమావేశానికి సుమారు 4వేల మంది హాజరయ్యారు. హన్మంత్ వెంకటేశ్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాకులు కేతావత్ బీల్యానాయక్, వడ్త్య రమేశ్‌నాయక్, కంకణాల వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, కేతావత్ బాలూనాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, లోకసాని తిరుపతయ్య, ముత్యాల సర్వయ్య, రాజీనేని వెంకటేశ్వర్రావు, మారుపాకుల సురేశ్‌గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు తూం నాగార్జున్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వైస్ చైర్మెన్ రహత్‌అలీ, బీఆర్ఎస్ నాయకులు నాయిని సుధీర్‌రెడ్డి, ఏడ్పుల గోవింద్‌యాదవ్, రవికుమార్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.