సంస్థాన్ నారాయణపురం, జూన్ 25: సంస్థాన్ నారాయణపురంలో నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాల దందా జోరుగా సాగుతోంది…సామాన్య ప్రజలకు ఏదైన సర్టిఫికెట్ కావాలంటే ఎన్నో నిబంధనలు.. మీసేవ, నెట్ సెంటర్ నిర్వాహకులు తీసుకువచ్చే దరఖాస్తుల్లో సరైన పత్రలు లేకపోయినా అధికారులు క్షణాల్లో పనులు పూర్తి చేస్తారు. కల్యాణలక్ష్మి దరఖాస్తులో గెజిటెడ్ అధికారి సంతకం కావాల్సి ఉంటుంది.
దరఖాస్తులో అన్ని పత్రాలు ఉంటేనే మండల మెడికల్ ఆఫీసర్ గెజిటెడ్ సంతకం చేస్తున్నారు. సరైన పత్రలు లేకుంటే వాటిని తిరిగి పంపిస్తున్నారు. దీంతో మండల కేంద్రంలోని మీసేవ, నెట్ సెంటర్ నిర్వాహకులను ప్రజలు సంప్రదిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు నకిలీ స్టాంపులు తయారు చేసి మండల మెడికల్ ఆఫీసర్ సంతకాలను ఫోర్జరీ చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారు. మండల అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ల కనుసన్నుల్లోనే ఫోర్జరీ దందా కొనసాగుతున్నా ఉన్నతాధికారులు ఇవేమి పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు..
మండలంలోని మీసేవ, నెట్ సెంటర్ నిర్వాహకులు ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో రేటు నిర్ణయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు నుంచి చెక్కు వచ్చే వరకు పూర్తి బాధ్యత మాదే అని చెప్పి ప్రజల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. బర్త్,డెత్ సర్టిఫికెట్లకు రూ.3 వేల నుంచి 10 వేల వరకు, కులం, ఆదాయ సర్టిఫికెట్ల కోసం రూ.200 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్లు, తాసీల్ధార్ కార్యాలయంలో పని చేసే అధికారులకు తెలిసే ఈ వ్యవహారం మొత్తం నడుస్తుండడం గమనార్హం..
కొద్ది రోజుల క్రితం మండల కేంద్రంలోని మీసేవ సెంటర్ నిర్వాహకుడు బర్త్ సర్టిఫికెట్ కోసం ఆర్డీవో ప్రొసీడింగ్ లెటర్‌ను సైతం ఫోర్జరీ చేసి దరఖాస్తు చేశాడు. అనుమానం వచ్చిన పంచాయతీ కార్యదర్శి ప్రొసీడింగ్ లెటర్ ఫోర్జరీ జరిగిందాని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు.. ఆర్డీవో ప్రొసీడింగ్ లెటర్ ఫోర్జరీ జరిగిన విషయం, కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తులో ఫేక్ పదోతరగతి మెమోలు పెడుతున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకుండా మీనమేశాలు లెక్కిస్తున్నారు..
కల్యాణలక్ష్మి, బర్త్, డెత్ సర్టిఫికెచ్ల దరఖాస్తుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మీసేవ, నెట్ సెంటర్ నిర్వాహకులు తీసుకువచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఇన్కామ్ సర్టిఫికెట్ల దరఖాస్తూలను సంబంధిత అధికారులు పరిశీలించకుండానే ఒకే.. చేస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది..అధికారులకు మీసేవ, నెట్ సెంటర్ నిర్వాహకులు కావాల్సినవి ముట్టజెప్పుతండడంతో నిర్వాహకులు నకిలీ స్టాంపులు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
మీసేవ, నెట్ సెంటర్ నిర్వాహకులు కల్యాణలక్ష్మి దరఖాస్తులు పదుల సంఖ్యలో తీసుకొని వచ్చి గెజిటెడ్ సంతకాలు చేయమని వచ్చేవారు. సరైన పత్రలు లేకపోవడంతో చాలావరకు తిప్పి పంపించే వాళ్లం.. సంతకాలు చేయకపోతే మాకు వాళ్లు, వీళ్లు తెలుసని చెప్పేవారు. అయిన సంతకాలు చెసేవాళ్లం కాదు. మండల మెడికల్ ఆఫీసర్ స్టాంపులు, సంతకాలు ఫోర్జరీ చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. సామాన్య ప్రజలను మోసం చేస్తూ మెడికల్ సిబ్బంది సంతకాలు ఫోర్జరీ చేసిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.
– మండల మెడికల్ ఆఫీసర్ జ్యోత్స్న