నార్కట్పల్లి జూలై 26 : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించిది. గుట్ట కింద ఉన్న ఒక దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పక్కనే ఉన్న 15 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ. కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో గుట్ట కింద , గ్రామ పంచాయతీ కార్యాలయం పరిధిలో ఉన్న 15 దుకాణాల్లోని ఒకరి షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దీంతో దుకాణాల్లోని సామాన్లు, బొమ్మలు, ఇద్దరి ఇళ్లలోని బట్టలు, సామగ్రి, నగదు, బంగారం పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ఈ ఘటనలో ఇద్దరి ఇండ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లలో మూడు పేలిపోవడంతో పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంటలు అంటుకున్నాయి. దీంతో కార్యాలయంలోని రికార్డులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ. 20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 పెద్ద, చిన్న దుకాణాలు, జనరల్, కిరాణ, కూల్డ్రింక్స్, బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. కాగా ఒక్కో దుకాణంలో సుమారు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు సామాన్లు ఉన్నాయని అవన్నీ కాలి బుడిదయ్యాయని, ఇవే కాకుండా దుకాణం ముందు రేకులు, పట్టాలు కాలిపోయాయని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ఆయనను చూడగానే బాధితులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. తమకు అన్యాయం జరిగిందని, తమను కాపాడాలని వేడుకున్నారు. తానున్నాంటూ ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఒక దుకాణంలో విద్యుత్తు ప్రమాదం కారణంగా మంటలు చెలరేగి ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అగ్ని ప్రమాదం సంభవించి దుకాణాలు కాలిపోయాయని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన దుకాణాదారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలన్నారు.
సుమారు రూ. 8 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని, ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. చెర్వుగట్టు గుట్ట కింద నంది విగ్రహం పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చారు. సర్వం కోల్పొయిన బాధితులకు రూ. 10 లక్షల పరిహారం అందించి వారు మళ్లీ పూర్తిస్థాయిలో గుట్టపై వ్యాపారాలు చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.