యాదగిరిగుట్ట, అక్టోబర్ 5 : పాతగుట్ట రోడ్డు విస్తరణ పనుల్లో గందరగోళం నెలకొన్నది. రోడ్డుకు ఇరువైపులా నివసించే స్థానికులకు ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండానే పురపాలక శాఖ అధికారులు మార్కింగ్ వేసి వెంటనే ఇండ్లు తొలగించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారే తప్ప, ఇప్పటి వరకు వారితో మాట్లాడిందిలేదు కదా.. కనీసం రోడ్డు విస్తరణలో ఏ మేరకు భూసేకరణ చేస్తున్నారు.. అసలు ఏం జరుగుతున్నదన్న గందరగోళ పరిస్థితుల్లో కాలనీ వాసులు ఉన్నారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రానికి వెళ్లేందుకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సిందేనని, కానీ తమ నష్టపరిహారం మాటేమిటంటూ అక్కడి ప్రజల ప్రధాన ప్రశ్న. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, న్యాయపరంగా తమకు నష్టపరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భూసేకరణ అయోమయం
గతంలో కేవలం 40 ఫీట్ల మేరకే విస్తరిస్తాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ విస్తరణ చేపట్టాల్సి వస్తే నష్టపరిహారం చెల్లిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పాతగుట్ట రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు 60 ఫీట్ల వరకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అధికారులు తమ ఇండ్లకు మార్కింగ్ వేసి వెళ్లారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే, తమతో సంప్రదించకుండానే ఇండ్లు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు తమకు మౌఖిక ఆదేశాలిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. లేకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇండ్లు కూల్చి వేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే 180 ఇళ్లకు గాను 40 ఇళ్లు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని వారు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, స్థానిక సంస్థ అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు విన్నించినా ఫలితం లేదని వారు చెబుతున్నారు.
పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయాలని..
పట్టణంలోని పాత గుట్ట చౌరస్తా నుంచి పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు బీటీ రోడ్డుకు గత ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయగా గత ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న 40 ఫీట్ల రోడ్డు కాకుండా మరో 10 ఫీట్లు వెడల్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ప్రధాన రోడ్డులో ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి గజానికి రూ. 12 వేల నష్టపరిహారం ఇచ్చామని, అదే తరహాలో పాతగుట్ట రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి సైతం వర్తింప జేస్తామని హామీఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 60 ఫీట్ల వెడల్పు పెంచి ఎలాంటి నోటీసులు, నష్టపరిహారం ప్రకటించకుండానే ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు స్థానికులకు మౌఖిక ఆదేశాలిస్తున్నట్లు సమాచారం.
నష్టపరిహారం చెల్లించాల్సిందే..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూచించిన విధంగా 40 ఫీట్ల వరకు మాత్రమే రోడ్డును విస్తరించాలి. అంతకంటే ఎక్కు వ విస్తరిస్తే నష్టపరిహారం చెల్లించాలి. యాదగిరిగుట్ట అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. పాతగుట్ట రోడ్డు పునరుద్ధరించాల్సిందే.. కానీ మా జీవితాలు రోడ్డున పడేయవద్దు. ప్రధాన రోడ్డుపై ఇండ్లు, బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిహారాన్నే మాకు ఇవ్వాలి.
– కోకల రవీందర్, యాదగిరిగుట
నోటీసులివ్వకుండా ఎట్లా కూలుస్తరు..
రోడ్డు విస్తరిస్తే మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మార్కింగ్ వేసి ఇండ్లు కూల్చి వేస్తామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు విస్తరించే యోచనలో అధికారులు ఉన్నట్లున్నారు. దీనిపై గతంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్‌ను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేదు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు పునరాలోచన చేసి మాకు న్యాయం చేయాలి.
-బడుగు మల్లేశం, బాదితుడు యాదగిరిగుట్ట పట్టణం