నీలగిరి, జూలై 29 : నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి తనకు తాను అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీస్ సిబ్బంది అప్రమత్తమై కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది. మంగళవారం సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎస్ఐ సైదులు రోజువారి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని దేవరకొండ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బైక్‌పై వస్తున్న పట్టణానికి చెందిన రావిళ్ల నర్సింహ్మ అనే వ్యక్తిని ఆపి డ్రంకెన్ టెస్ట్ చేయగా 155 ఎంజీ/100ఎంఎల్ ఆల్కహాల్ రీడింగ్ వచ్చిందని తెలిపారు. తాగి వాహనం నడపడం సరైంది కాదని కౌన్సిలింగ్ ఇచ్చి, రేపు ఉదయాన్నే స్టేషన్‌కు రావాలని ఎస్ఐ సూచించి పంపించాడు.
అక్కడి నుండి వెళ్లిపోయిన నర్సింహ్మ సుమారు 40 నిమిషాల తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తనపైనే కేసు పెడుతారా అంటూ స్టేషన్ మెయిన్ గేట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడన్నారు. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు ప్రవీణ్‌కు నర్సింహ్మ శరీరం నుండి పెట్రోల్ వాసన వస్తుండడాన్ని గమనించి నిలువరించే ప్రయత్నం చేశాడు. బయట తన శరీరంపై పెట్రోల్ పోసుకుని స్టేషన్‌కు వచ్చిన నర్సింహా తన వెంట తెచ్చుకున్న లైటర్‌ను వెలిగించడంతో శరీరానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. తక్షణం స్పందించిన కానిస్టేబుల్ అంజద్ బెడ్‌షీట్‌తో మంటలు ఆర్పాడు. దీంతో నర్సింహాకు ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ప్రవీణ్ చేతులకు మంటలంటుకోవడంతో గాయాలయ్యాయి. పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, ఆత్మహత్యాయత్నం చేయడంపై పోలీసులు నర్సింహాపై కేసులు నమోదు చేశారు.