బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 28 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు కట్ట ప్రాంతం కట్ట కంటే కిందికి ఉంటుందని, టెక్నికల్‌గా ఇది ఆనాడు ఎఫ్టీఎల్ అని పడి ఉంటుంది తప్ప వాస్తవంలో ఆ పరిస్థితి లేదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఎఫ్టీఎల్ పేరుతో మార్కింగ్‌లు ఇస్తూ ప్రజలను ఎందుకు భయపెడుతున్నారని ప్రశ్నించారు. తన ప్రాణం పోయినా ఈ దుర్మర్గాన్ని ఆపి తీరుతానని స్పష్టం చేశారు.
నాలుగు రోజుల నుంచి సద్దుల చెరువు ప్రాంతాల్లో అధికారులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సర్వే చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతుండడం తెలుసుకున్న ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి శనివారం వారి నివాసాల వద్దకు వెళ్లి భరోసానిచ్చారు. 30, 42, 43వ వార్డుల్లో పర్యటించి నేనున్నానంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జగదీశ్‌రెడ్డిని చూసి స్థానిక ఒక్కసారిగా దుఃఖం వెల్లదీస్తూ తమ బాధను వినిపించారు.
అప్పట్లో ఎంత కష్టం చేసి భూములు కొన్నది, ఇండ్లు కట్టుకున్నది వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఇక్కడి పరిస్థితులపై తనకు అవగాహన ఉందని, మీ ఇండ్లకు ఏమీ కాదని భరోసానిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలోని 30, 42, 43వ వార్డులు సద్దుల చెరువు కింది ప్రాంతాలు అని, ఇక్కడ చెరువు కట్టను కూడా ప్రభుత్వమే నిర్మించిందని తెలిపారు. ఇక్కడికి ఎన్నడూ ఒక చుక్క నీరు రాలేదని, స్థానికంగా మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వాటిని మించి 500 మీటర్ల వరకు ఇండ్లు కూలగొడుతామంటే ఊరుకునేది లేదన్నారు.
ఇక్కడ ఇండ్లను కూలగొడితే వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని, ఇది నీరు నిలిచే ప్రాంతం కాదని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ కట్ట కంటే పైకి ఉంటుందని, కానీ ఈ ప్రాంతం కట్టకు దిగువన ఉంటుందని తెలిపారు. టెక్నికల్‌గా ఆనాడు ఎఫ్టీఎల్ అని పడి ఉంటుంది తప్ప వాస్తవానికి ఎఫ్టీఎల్ పరిధి కాదని వివరించారు. మార్కింగ్ ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తామంటూ చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇక్కడి ప్రజలు భూమి కొనుక్కొని గుడిసెలు వేసుకుని ప్రభుత్వానికి డబ్బు రిజిస్ట్రేసన్ చేయించుకున్నారని తెలిపారు.
నాడు ‘మేం ప్లాట్లు కొని మోసపోయాం. ఎవరో వచ్చి మాది అంటే కొన్నామని చెప్తే.. అధికారులు ఎవరి దగ్గర కొన్నది మాకు తెల్వదు.. ప్రభుత్వానికి డబ్బు కడితే రిజిస్ట్రేషన్ చేస్తామంటే తిరిగి రెండోసారి డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు’ అని గుర్తు చేశారు. ఇక్కడ ప్రతి ఇంట్లో శ్రమజీవుల కష్టం ఉందని, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అప్పుడింత అప్పుడింత ఇల్లు కట్టుకుంటే.. ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతలకు పాల్పడుతామంటే.. ఆ దుర్మార్గాన్ని సాగనివ్వనన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యేగా ప్రాణం పోయినా ప్రజల వెంట ఉండి ఈ దుర్మర్గాన్ని ఆపుతానన్నారు.
ఏ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గం చేస్తుందో.. అక్కడికి కూడా వెళ్తామన్నారు. తప్పు మీరు చేసి ప్రజలు శిక్ష వేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సర్కారు బాధ్యతారాహిత్యంతో ప్రజలకు కంటి మీద కనుకు కరువైందని, ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన పనులు ఆపి ఒక శాస్త్రీయమైన నిర్ణయం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్టీఎల్ బఫర్‌ను నిర్ణయించాలన్నారు.
అనంతరం అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజలకు నష్టం జరిగేందుకు కారణం ప్రభుత్వ శాఖలే అయినప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తాను ఎమ్మెల్యే అయ్యాక సూర్యాపేటలోని మూడు మూడు చెరువుల్లో ఎఫ్టీఎల్ లెవల్లో నీరు నిలబెట్టి భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలూ రాకుండా ఎక్కడా నూతన నిర్మాణాలు జరుగకుండా చేశానన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే మార్కింగ్ పెట్టమని చెప్పిందో ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ కానేకాదని చెప్పారు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్‌ను కలిసి వివరిస్తానన్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వెంట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి, మున్సిపల్ కో అప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ, బీఆర్ఎస్ నాయకులు అంగిరేకుల నాగార్జున, రమేశ్ ఉన్నారు.