పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యానికి సూర్యాపేట జిల్లాలో కరువు ఏర్పడింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు సరఫరా చేయాల్సిన గడువు ముగిసినా జిల్లాలోని గోదాములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కనీసం 10 శాతం లక్ష్యం కూడా చేరుకోలేదు. ప్రతి నెల 20 నుంచి నెలాఖరు నాటికి 610 రేషన్ షాపులకు 4,705 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా.. ఈ నెల గడవు దాటి మూడు రోజులైనా కేవలం 117 షాపులకు 830 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేశారు. గత నెలలో కూడా ఇదే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం పౌరసరఫరాల అధికారులు మిల్లర్ల చుట్టూ తిరుగుతూ అయ్యా… బాబూ బియ్యం పంపండి అంటూ బతిమిలాడుకుంటున్నారు.
త్వరలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామంటూ ఇటీవల మంత్రులు గొప్పలకు పోగా.. వాస్తవానికి దొడ్డు బియ్యానికే దిక్కు లేని పరిస్థితి. జిల్లాలో ఫుడ్ సెక్యూరిటీ, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర కార్డులు కలిపి 3,24,188 ఉండగా, నెలనెలా ఆయా రేషన్ షాపుల్లో ఉండే పాత స్టాక్ ను బట్టి 4,800 నుంచి 5,900 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుంది. డిసెంబర్ నెలకు సంబంధించి 4,705 మెట్రి క్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. కానీ, జిల్లాలోని ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు ఖాళీగా కనిపిస్తున్నాయి. గడువు ముగిసినా నేటికీ పది శాతం కూడా సరఫరా కాలేదు. గత బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థతి లేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం రెండు, మూడు నెలల నుంచి గోదాములు ఖాళీగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి నెల 23 నుంచి నెలాఖరు వరకు గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లు, అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేస్తారు. ప్రతి నెల ఒకటో నుంచి 15 వరకు డీలర్లు రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. డీలర్ల వద్ద ఉండే ఈ-పాస్ మిషన్లు కూడా 15వ తేదీ సాయంత్రం ఆన్లైన్ ఆఫ్ అవుతాయి. అలాంటిది గత నెల 15 వరకు కూడా డీలర్లకు బియ్యం సరఫరా కావడంతో నెలాఖరు వరకు ఈ పాస్ మిషన్ సేవలను అందుబాటులోకి ఉంచి పంపిణీ చేశారు.
ప్రభుత్వ అసమర్థత… ముందు చూపు లేకనే..
కాంగ్రెస్ సర్కారు అసమర్థత, ముందుచూపు లేమితోనే గోదాములు ఖాళీ అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాల నుంచి పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లులకు ఇచ్చి సరైన సమయంలో బియ్యం తీసుకోగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రేషన్ బియ్యం సేకరణ కష్టంగా మారింది. బియ్యం రేషన్ షాపులకు వస్తున్న కార్డుదారులు డీలర్లు బియ్యం ఇంకా రాలేదని చెప్తుండడంతో వెనుదిరుగుతున్నారు. పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులకు జిల్లాలోని మిల్లులకు తిరుగుతూ బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం నిధులు లేకపోగా నిధులు వచ్చిన వెంటనే డబ్బులు ఇస్తామని బతిమాలడడం, కొన్ని సందర్భాల్లో బెదిరింపులకు దిగడం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారం నుంచి మిల్లుల చుట్టూ తిరిగి కేవలం 825 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించగా, సోమవారం మరో ఐదు మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 830 మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితి ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలోనని డీలర్లు విసుగెత్తిపోతున్నారు.