నీలగిరి, జూలై 24 : నల్లగొండ పట్టణంలోని లతీఫ్సాబ్ ఘాట్‌రోడ్డు పనులను అధికారులు గురువారం భారీ బందోబస్తు నడుమ ప్రారంభించారు. లతీఫ్సాబ్ దర్గాకు, బ్రహ్మంగారి గుట్ట ప్రాంతాలకు మునుగోడు బైపాస్ 3 కిలోమీటర్ల దూరం ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.149 కోట్లు కేటాయించారు. ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన భూమిలో నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ ఇందుకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండానే టెండర్ల పూర్తి చేశారు. దీంతో ఆగ్రహించిన పట్టణంలోని పలు ముస్లిం సంఘాలు నిరసనలు తెలిపి, ఫిర్యాదులు చేశాయి.
తాము ఏలాంటి అనుమతులు ఇవ్వలేదని, వక్ఫ్ బోర్డు భూముల్లో ఎలాంటి రోడ్ల నిర్మాణం చేయొద్దని, అందుకు తాము ఎన్టీసీ ఇవ్వలేమంటూ వక్ఫ్‌బోర్డు సీఈఓ ఆర్అండ్బీ అధికారులకు లేఖలు రాశారు. కాగా వక్ఫ్‌బోర్డు సీఈఓ లేఖలు రాసిన 15 రోజుల అనంతరం పనులను ప్రారంభించారు. అయితే ఎలాంటి ఆందోళనలు జరుగకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. నల్లగొండ పట్టణంలోని ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఏఎస్ఐ, మరో పది మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పనులు జరుగుతున్నంత సేపు గస్తీ కాశారు.
Nilagiri : భారీ బందోబస్తు నడుమ లతీఫ్సాబ్ ఘాట్‌రోడ్డు పనులు ప్రారంభం