చండూరు,జూలై 26 : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వల్ల నియోజకవర్గ రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నియోజకవర్గం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన చండూరులో విలేకరులతో మాట్లాడుతూ డిండి ప్రాజెక్టు నీటి పంపకాల్లో మునుగోడుకు రావాల్సిన నీటిని 440 అడుగుల వద్ద రెగ్యులేటర్ పెట్టి.. 436 అడుగుల వద్ద మోటర్లు బిగించి మహబూబ్‌నగర్‌కు తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత బహిరంగంగా మునుగోడును ఎడారి చేస్తున్నా రాజగోపాల్‌రెడ్డి ఏ గుడ్డి గుర్రం పళ్లు తోముతూ కుర్చొన్నారని ప్రశ్నించారు. 436 అడుగుల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదుల నుంచి డిండికి నీరు ఇవ్వొద్దని నేరుగా శ్రీశైలం నుంచి తీసుకోవాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై వత్తిడి తెస్తున్నారన్నారు. కానీ రాజగోపాల్‌రెడ్డి ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడాల్సింది పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మాట్లాడుతున్నానని ఉత్త మాటలు చెబుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రితో మాట్లాడి మునుగోడుకు రావల్సిన 20 టీఎంసీల నీటిని తేవాలని హితవు పలికారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన ఉనికి కోసం ఆరాటపడుతున్నాడే తప్ప మునుగోడుకు సాగు, తాగు నీరు తేవాలనే ఆలోచన కొంచమైనా లేదని కూసుకుంట్ల అన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకుండా నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు వెళ్లి ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అనడం సిగ్గుచేటన్నారు. ముందు మునుగోడులోని నీ ఇంటి ని చక్కబెట్టుకొని ఇతరులను అనాలని హితవు పలికారు. నియోజకవర్గంలోని కరుడుగట్టిన కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా వందల కొట్ల కాంట్రాక్టుల కోసం పార్టీలు మారుతూ, తాను ఏ పార్టీ మారితే ఆ పార్టీలోకి వచ్చే వారికే పదవులు కట్టబెడుతూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పదవిలో ఉంటూ దళిత ఎమ్మెల్యేలను చులకన చేసి మాట్లాడటం ఎంత వరకు సబబు అని కూసుకుంట్ల ప్రశ్నించారు. తన ముఖం చూసి తుంగతుర్తి, నకిరేకల్ కాంగ్రెస్ కార్యకర్తలు మందుల సామేల్, వేముల వీరేశంలను ఎమ్మెల్యేలుగా గెలిపించారని, తప్పుడు వ్యక్తికి ఓటు వేయమని చెప్పానంటూ దళితుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు రాజగోపాల్‌పై దళితులు ఆగ్రహంగా ఉన్నారని, తక్షణమై వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్‌రావు, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బొడ్డు సతీష్, యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్‌రావు, మాజీ మండల అధ్యక్షులు పెద్దగొని వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు తేలుకుంట్ల చంద్రశేఖర్, సామయాదవరెడ్డి, నకరికంటి రామలింగం, ఇడికూడ శ్రీను, మహ్మద్ గౌస్, రాపోపు జగదీశ్, జొర్రీగెల వెంకన్న, తాందారి రవి, ఇడికోజు నాగరాజు, సంగెపు సువర్ణ, నందికొండ నర్సిరెడ్డి, చొప్పరి దశరథ, ఇరిగి రామన్న, నారపాక శంకర్, నారపాక ధనయ్య, నక్క సుధీర్, వర్కాల అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.