కట్టంగూర్, జనవరి 02 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. నృత్యంతో పాటు ఇతర ప్రదర్శనలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎంఈఓ అంబటి అంజయ్య అభినందించి మాట్లాడారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, వారి సృజనాత్మకతను వెలికితీయడానికి వైజ్ఞానిక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు పరిశోధనపై ఆసక్తి పెంచుకోవడానికి, సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను రూపొందించేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సహాయ పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారి నీలాంబరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.