కట్టంగూర్, ఫిబ్రవరి 10 : కట్టంగూర్ ఎఫ్‌పీఓ ప్రపంచంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆదర్శమని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగం డైరెక్టర్ క్వింటన్ ఆర్ టైలర్ అన్నారు. సోమవారం మండలంలోని అయిటిపాముల జీపీ పరిధిలో గల గంగాదేవిగూడెం సమీపంలో ఉన్న కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగానికి చెందిన ఆమెరికా శాస్త్రవేత్తల బృందం సభ్యులు సందర్శించారు. సంఘం నిర్వాహకులు నిమ్మ స్టోరేజీ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్, సోలార్ డయ్యర్స్ గురించి వారికి వివరించారు.
సన్న, చిన్న కారు రైతులు సమస్యలను పరిష్కరించుకునేదుకు సంఘటితంగా ఎఫ్‌పీఓను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు ఖరీం మరిడియా, నాబార్డు డీడీఎం వినయ్‌కుమార్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి సంగీత లక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, ఏడీఏ హుస్సేన్‌బాబు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఉద్యానవన అధికారి రావుల విద్యాసాగర్, ఏఓ శ్రీనివాస్, ఎఫ్‌పీఓ చైర్మన్ సైదమ్మ, డైరెక్టర్లు పాల్గొన్నారు.