శ్రమ, కసి, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించొచ్చని నిరూపించారు పెర్కకొండారం వాసులు. నాటి పరిస్థితుల ప్రభావంతో మొదట ట్రాన్స్పోర్ట్, ఇతర లారీలు తోలిన వారు బస్సు స్టీరింగ్ పట్టి ఎంతో మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్నారు. ఆర్టీసీలో ఉద్యోగం సాధించి తమ కుటుంబాలను ఉన్నతమైన స్థానంలో ఉంచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో మొత్తం 850 కుటుంబాలు, 3,260మంది జనాభా ఉన్నది. ఒక్క ఆర్టీసీ డిపార్ట్‌మెంటులోనే ఈ గ్రామానికి చెందిన 120మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో 36 మంది ఉద్యోగ విరమణ చేయగా.. 10మంది మృతి చెందారు. ప్రస్తుతం 74 మంది వివిధ హాదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
– శాలిగౌరారం, ఫిబ్రవరి 9
శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో వ్యవసాయ కుటుంబాలే ఎక్కువ. అధిక శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేది. అయితే.. గతంలో సరైన నీటి వసతి, కరెంట్ సక్రమంగా లేకపోవడంతో సాగు కష్టమయ్యేది. ఈ క్రమంలో అనేక మంది యువత ఎస్ఎస్సీ, ఇంటర్, ఆ పైన చదువుకున్న వారు జీవనోపాధి కోసం లారీ క్లీనర్లుగా పోయి డ్రైవర్లుగా రాణించారు. నాటి పరిస్థితుల ప్రభావమే వారిని డ్రైవర్ల బాట పట్టించాయి. ఆ ప్రస్తానమే నేడు ఆర్టీసీ ఉద్యోగాల వైపు నడిపించింది. అనంతరం పలువురు ఆర్టీసీలో ఉద్యోగాలు సాధించారు. 12మంది కండక్టర్లు, ఇద్దరు మెకానిక్‌లు ఉండగా.. మిగతా వారంతా డ్రైవర్లే. గ్రామంలో మొదట డ్రైవర్ ఎండీ యాకూబ్ అలీ. ఆయన అప్పట్లోనే స్టీమ్ ఇంజిన్ ఆవిరితో నడిచే వాహనాన్ని నడిపి గ్రామానికే ఆదర్శంగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో అనేక మంది డ్రైవర్లుగా రాణించారు.
మా నాన్న కూడా ఆర్టీసీ డ్రైవరే
మా నాన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్. మా నాన్నను ఆదర్శంగా తీసుకొని ఆ వృత్తి వైపు మళ్లాను. నేను మొదట ట్రాన్స్‌పోర్టు లారీ తోలాను. 1996లో ఆర్టీసీ డ్రైవర్‌గా సెలక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో పని చేస్తున్నా. ప్రస్తుతం సూర్యాపేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నా. అప్పట్లో పడ్డ కష్టం వృథా కాలేదు. ఆ కష్టమే ఇప్పుడు నాకు, నా కుటుంబానికి భరోసా కల్పించింది. ఈ వృత్తి నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం సూర్యాపేటలో స్థిరపడ్డాం.
– పి.విప్లవరెడ్డి, ఆర్టీసీ డ్రైవర్, పెర్కకొండారం
2008 నుంచి కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా
మా గ్రామంలో చాలా మంది ఆర్టీసీలో డ్రైవర్లుగా ఉద్యోగాలు సాధించారు. ఏదైనా గవర్నమెంటు కొలువు సాధించాలని చిన్నప్పట్నుంచి అనుకున్నా. నల్లగొండలో ఐటీఐ పూర్తి చేసిన సమయంలో ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించా. దాంతో నా కల నెరవేరింది. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉద్యోగం చేస్తుండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం నకిరేకల్‌లో స్థిరపడ్డాను.
– జి.శ్రీనివాస్, ఆర్టీసీ బస్సు కండక్టర్, పెర్కకొండారం
డ్రైవింగ్ అంటే ఇష్టం
నాకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే ఆర్టీసీలో చేరేలా చేసింది. మా ఊరిలో ఎక్కువగా ట్రాక్టర్, లారీ డ్రైవర్లుగా ఉండేవారు. వారిని చూసి నేనూ నేర్చుకున్నా. 1988లో ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరాను. రంగారెడ్డి, మిర్యాలగూడ, నల్లగొండ డిపోల్లో పని చేశాను. చివరిసారిగా హయత్‌నగర్-2 డిపోలో పని చేసి 2018లో ఉద్యోగ విరమణ పొందాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం.
– ఎదుల్ల సత్యనారాయణరెడ్డి, రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్