నల్లగొండ సిటీ, జనవరి 01 : నిరంతరం పేదల సమస్యలపై పోరాడుతూ కడవరకు కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. గురువారం కనగల్లు మండలం ధర్వేశిపురంలో అమరజీవి జినుకుంట్ల లింగయ్య స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ.. చిన్ననాటి నుండి ఎర్రజెండా చేతబట్టి గ్రామాల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నడిపిన వీరుడు లింగయ్య అని కొనియాడారు. వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు పెంచాలని, దున్నేవాడికే భూమి, గీసే వాడికి చెట్టు ఉండాలనే నినాదంతో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేసి హరాజు వేలం పాటలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారన్నారు. అదేవిధంగా గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన నడిపిన పోరాటాల స్ఫూర్తితో నేటి యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సిపిఎం మండల కార్యదర్శి కానుగు లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, దండంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, గీత సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, సిఐటియూ జిల్లా నాయకులు అవుట రవీందర్, నల్లగొండ, తిప్పర్తి మండల కార్యదర్శి మన్నె భిక్షం, నలపరాజు సైదులు, ధర్వేశిపురం గుడి చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాయల శేఖర్, మాజీ చైర్మన్లు అలుగుబెల్లి నర్సిరెడ్డి, దీప కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చీదేటి కృష్ణారెడ్డి, చర్లగౌరారం మాజీ ఉప సర్పంచ్ చింతల బహ్మయ్య, పార్టీ మండల కమిటి సభ్యులు చీదేటి బ్రహ్మనందరెడ్డి, కందుల సైదులు, ఎండీ అక్రం, ఎస్కే సుల్తానా, కుటుంబ సభ్యులు జినుకుంట్ల సైదులు, సునీత కృష్ణయ్య, కళమ్మ, చెనగోని యాదగిరి, అంజమ్మ, పాలకురి పుల్లయ్య, యాదమ్మ, మట్టపల్లి పాపయ్య, అండాలు, సిరిగల రాములు, అంశమ్మ పాల్గొన్నారు.