– క్రీడా పోటీలను ప్రారంభించిన అదనపు ఎస్పీ రమేశ్
నల్లగొండ రూరల్, ఆగస్టు 23 : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో 17వ ఈశా గ్రామోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈశా ఫౌండేషన్ నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పురుషుల వాలీబాల్‌లో 15 జట్లు, మహిళల త్రోబాల్‌లో 10 జట్లు పాల్గొన్నాయి. నల్లగొండ అదనపు ఎస్పీ జి.రమేశ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఇషా ఫౌండేషన్ వారు ప్రత్యేక గ్రామోత్సవం నిర్వహించి, గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం శుభ పరిణామం అన్నారు. DYSO అక్బర్ అలీ, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ కె.సతీశ్, కేబినెట్ సెక్రెటరీ రామకృష్ణ, SGF సెక్రెటరీ విమల, TG PED, PET సెక్రెటరీ కవిత PETA TS సెక్రెటరీ శ్రీనివాస్, TG PET సెక్రటరీ వెంకట్ రామ్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ఆటగాళ్లను ఉత్తేజ పరిచారు. పేరిణి నాట్యం, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది.
2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించినది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 22 జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహించబడతాయి. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 21 వరకు క్లస్టర్ (జిల్లా స్థాయి), డివిజనల్ (రాష్ట్ర స్థాయి) & ఫైనల్ (దక్షిణ భారత దేశ రాష్ట్రాల పోటీ) – 3 దశల్లో మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. ప్రతీ స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమానం ఉంటుంది. ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఈశా యోగా సెంటర్, కోయంబత్తూరులో జరగనుంది. విజేత జట్లకు ఈశా రిజువినేషన్ ట్రోఫీ, ఇంకా నగదు బహుమతులు – వాలీబాల్ (పురుషులు): రూ.5 లక్షలు, త్రోబాల్ (మహిళలు): రూ.5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
Nalgonda Rural : నల్లగొండలో అట్టహాసంగా ఈశా గ్రామోత్సవం