నీలగిరి, ఏప్రిల్ 11 : అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి వెయ్యి లీటర్ల డీజిల్, రెండు డీసీఎం వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ్ల పట్టాలు (సుమారు రూ.40 లక్షల విలువ)ను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు, ఇతర హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్రకులు, ఇతర భారీ వాహనాల నుంచి వరుసగా డీజిల్ చోరీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎస్పీ ఆదేశానుసారం పోలీస్ సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అందులో భాగంగా శుక్రవారం రాత్రి చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై అనుమానాస్పదంగా నిలిచి ఉన్న డీసీఎంను గమనించినట్లు తెలిపారు. అ వాహనాన్ని తనిఖీ చేయగా వడ్ల పట్టాల చాటున డీజిల్‌తో నిండిన క్యాన్లను గుర్తించి వాహన డ్రైవర్ బాలకృష్ణ, ఇతరులను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిపారు. ఏపీలోని పల్నాడు జిల్లా బొల్లంపల్లి మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన నిందితులు ముడావత్ గాంధీనాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్, బనావత్ తుల్స్యనాయక్, ముడావత్ బాలకృష్ణ నాయక్, రామవత్ వాగ్య నాయక్, మరో మైనర్ బాలుడుతో సహా మొత్తం ఆరుగురు కలిసి రెండు ముఠాలుగా ఏర్పడి హైవేపై ఆగి ఉన్న లారీల నుంచి డీజిల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.
అలాగే ముఠాకు చెందిన మరికొంత మంది సభ్యులు మరో డీసీఎంతో కొంత దూరంలో ఉన్నట్లు సమాచారం ఇవ్వగా దీనిపై స్పందించి ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి రెండో డీసీఎంను కూడా గుర్తించినట్లు తెలిపారు. దొంగల ముఠాను నల్లగొండ డీఎస్పీ కొలను శివరాం రెడ్డి పర్యవేక్షణలో పట్టుకొన్నారు. ప్రతిభ కనబర్చిన నల్లగొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్లు జితేందర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిట్యాల సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, సీసీఎస్ ఎస్ఐలు విజయ్ కుమార్, మధు, సతీష్ వర్మ, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, శ్రీను, కానిస్టేబుళ్లు అస్రర్, దస్తాగిరి, సాయికుమార్, జూనేద్, శివరాజు, నరేశ్, తదితర సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.