వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. సైలెన్స్ పిరియడ్ అమలులోకి రావడంతో అంతా గప్‌చుప్‌గా మారింది. ఇన్ని రోజులు సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు చివరి అస్ర్తాలపై దృష్టి సారించారు. తమ ప్రచార అంశాలపై నమ్మకం కుదరని కొందరు ప్రధాన సంఘాల అభ్యర్థులు ప్రలోభాలపైన గురి పెట్టినట్లు చర్చ సాగుతున్నది. ఓటరు వారీగా ప్రత్యేక సర్దుబాటుకు సిద్ధమై ఓటుకు నోటుతోపాటు మద్యం, విందు కార్యక్రమాలకు తెరలేపారు.
సోమవారం సాయంత్రం నుంచే కొందరు అభ్యర్థులు ఒక్కో ఓటరు వారీగా యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు హల్చల్ చేస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో మరికొంత మంది అభ్యర్థులు ఓటర్లపై డబ్బు, మద్యం ప్రయోగిస్తూ ఓట్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఓటుకు 2 వేల రూపాయల నుంచి 3వేల వరకు చెల్లింపులు కొనసాగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఖరీదైన మద్యం బాటిళ్లతో రెండు రోజుల పాటు దావత్‌లు కూడా షురూ అయినట్లు సమాచారం. సమాజంలో మార్గనిర్ధేశకులుగా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ వర్గాల ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రలోభాల చుట్టూ తిరుగుతున్నది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ఘట్టం కీలకమైన పోలింగ్ దశకు చేరుకున్నది. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండగా, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి నియోజకవర్గం పరిధిలోని 12 జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం సరిగ్గా 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 12 జిల్లాల పరిధిలోని 191 మండలాల్లోని మొత్తం 200 పోలింగ్ కేంద్రాల్లో 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వారిలో ప్రధాన సంఘాల అభ్యర్థుల్లో కొందరు ఓటరు నమోదు నాటి నుంచే ప్రచారంలో మునిగి తేలారు.
మరికొందరు నామినేషన్ల దాఖలు నుంచి ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో టీచర్స్ జాక్ అభ్యర్థి పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ సుందర్రాజు వంటి ప్రధాన సంఘాల అభ్యర్థులు గెలుపు తమదేనంటూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ అధ్యాపక, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తమ వ్యూహాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటల వరకు అభ్యర్థులంతా ప్రచారంలోనే ఉన్నారు. కొందరు అభ్యర్థులు ఓట్లపై ఇంకా నమ్మకం కుదరక అంతర్గత సర్దుబాట్లపై దృష్టి సారించారు.
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గం పరిధిలోని 200 పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. 12 జిల్లా కేంద్రాల్లోని 12 డిస్ట్రిబ్యూటరీ సెంటర్లలో ఉదయం 8గంటల నుంచి పోలింగ్ సిబ్బందికి స్టేషన్ల కేటాయింపును పూర్తి చేస్తారు. రూట్ల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది సామగ్రితో మధ్యాహ్న భోజనం తర్వాత బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రానికి పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. పోలింగ్ కోసం వినియోగిస్తున్న విద్యా సంస్థలు, కార్యాలయాలకు గురువారం స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓటరుగా నమోదై ఉన్న వాళ్లకూ సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
నీలగిరి, ఫిబ్రవరి 25 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్టబందోబస్తును ఏర్పాటు చేయడంతోపాటు 163 బీఎన్ఎస్ఎస్(144)సెక్షన్ అమలు చేయనున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే సైలెంట్ పిరియడ్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమ్మికూడవద్దని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలు వంటివి నిర్వహించవద్దని సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. బందోబస్తులో టీఎస్ఎస్సీతోపాటు 600 మంది పోలీస్ సిబ్బందితో విధుల్లో ఉంటారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటుకు గరిష్టంగా రూ.3వేలు..
ఈ ఎన్నికల్లో ఓటుకు గరిష్టంగా మూడు వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన ఓ ప్రధాన సంఘం అభ్యర్థి ఓటుకు 2వేల చొప్పున దాదాపుగా పంపిణీ పూర్తి చేశారు. బీసీ వాదంతో రంగంలో ఉన్న అదే జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి రూ.3వేల వరకు ముట్టచెప్తున్నట్లు తెలుస్తున్నది. ఇక అదే జిల్లాకు చెందిన ఓ ప్రధాన జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి సైతం 2 వేల వరకు మంగళవారం రాత్రి నుంచే పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చర్చ జరుగుతున్నది. ఓ పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న అభ్యర్థి కూడా ఓటుకు 2వేల చొప్పున యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ప్రధాన అభ్యర్థి సైతం సోమవారం సాయంత్రం నుంచే ఓటుకు 2వేల చొప్పున యూపీఐ చెల్లింపులు ప్రారంభించినట్లు స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ ప్రాతినిథ్యం వహిస్తున్న యూటీఎఫ్ సంఘం నేతలు మాత్రం అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, ప్రచార అంశాలనే నమ్ముకున్నారు. దాంతో ఇతర అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ అభ్యర్థి జిల్లాలను బట్టి వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు, మరో అభ్యర్థి 2 వేల నుంచి 5వేల వరకు, ఇంకో అభ్యర్థి 2వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపించారు. కొందరు ప్రధాన సంఘాల అభ్యర్థులు వాళ్లు దిగజారి ఉపాధ్యాయ విలువలను సైతం దిగజారుస్తున్నారని మండిపడుతున్నారు. చేసిన సేవలను చెప్పుకోలేక డబ్బు, మద్యం పంపకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్క శ్రీనివాసాచారి, పెరుమాళ్ల వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. డబ్బు పంపిణీకి ఎన్నికల కమిషన్ తక్షణమే అడ్డుకట్ట వేయాలని, మందు, నగదు పంపిణీ చేస్తున్న అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.