క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి క్రీడా మైదానాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో భువనగిరి జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఇండోర్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల క్రీడలు ఆడేలా ఏర్పాటు చేసింది. సర్వాంగ సుందరంగా, అన్ని వసతులతో రూపురేఖలు మార్చుకున్న ఈ స్టేడియాన్ని వారంలో ప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, జూన్ 23 (నమస్తే తెలంగాణ)
స్వరాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వం కోసం నాలుగు ఓపెన్ జిమ్ పార్కులు, మూడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.15లక్షలు ఖర్చు చేశారు. ఇవి పట్టణ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
నాడు అధ్వాన్నంగా.. నేడు అద్భుతంగా…
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ ఆఫీసు దగ్గరలో ఎప్పుడో నిర్మించిన ఇండోర్ స్టేడియం నిరుపయోగంగా మారింది. వసతులు లేకపోవడం, స్టేడియం అధ్వాన్నంగా ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. గతంలో ఉన్న చెక్క కోర్టు డ్యామేజీ అయ్యింది. మైదానంలో లైటింగ్ వ్యవస్థ లేదు. పెయింటింగ్ కూడా లేకుండా శిథిలావస్థకు చేరినట్లు కనిపించేది. దీంతో క్రీడాకారులు అటు వైపు వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు.
అయితే.. ప్రస్తుతం ఇండోర్ స్టేడియం అద్భుతంగా రూపుదిద్దుకున్నది. స్థానికుల విజ్ఞప్తి మేరకు రూ.13లక్షల పట్టణ ప్రగతి నిధులు, రూ.2.30 లక్షలు జనరల్ ఫండ్స్ వెచ్చించి రూపురేఖలు మార్చారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. పూర్తిగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో చెక్క కోర్టు ఉండగా, ఇప్పుడు సింథటిక్ కోర్టును ఏర్పాటు చేశారు. రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, రెండు టేబుల్ టెన్నిస్ కోర్టులు, రెండు క్యారమ్, మరో రెండు చెస్ బోర్డులు అందుబాటులో ఉంచారు. పెయింటింగ్‌తో స్టేడియం ఎంతో సుందరంగా కనిపిస్తున్నది. బయట ఒలింపిక్ మెడల్ గ్రహీత నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెంల గోపీచంద్ బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. నిర్వహణ కోసం కేర్ టేకర్‌ను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు.
క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తం
స్థానికుల విజ్ఞప్తి మేరకు ఇండోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేశాం. అంతకుముందు ఎలాంటి వసతులూ లేవు. పట్టణ ప్రగతిలో భాగంగా నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశాం. సింథటిక్ కోర్టులు, లైటింగ్ సిస్టం, టేబుల్ టెన్నిస్‌తోపాటు వసతులు కల్పించాం. ఇప్పుడు స్టేడియం ఎంతో సుందరంగా కనిపిస్తున్నది. భువనగిరి పట్టణవాసులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.
– నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్