యాదగిరిగుట్ట, మే 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ స్వామివారికి తిరువీధి సేవ, దర్భార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రివేళ స్వామివారి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్, శివాలయంలో గల క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.28,12,569 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.