నీలగిరి, డిసెంబర్ 1: అధిక వడ్డీ పేరుతో పీఏ పల్లి మండలం పలుగు తండాకు చెందిన బాలాజీ నాయక్ చేసిన మోసం మరువక ముందే మరో భారీ మోసం వెలుగు చూసింది. పది రూపాయలకు పైగా వడ్డీ అంటూ బాలాజీ నాయక్ వసూలు చేస్తే.. హైదరాబాద్ కేంద్రంగా టూవెల్త్ క్యాపిటల్స్ సర్వీసెస్ అనే సంస్థ చేతిలో మరోమారు జిల్లా ప్రజలు మోసపోయారు. సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి నాలుగు రూపాయల వడ్డీ, జామీనుగా రూ.నాలుగు లక్షలకు గుంట జాగాతోపాటు 25 నెలలపాటు ప్రతినెలా రూ.16 వేల వడ్డీ, అనంతరం నాలుగు లక్షలకు రెట్టింపు డబ్బు అంటూ అమాయక ప్రజల నెత్తిన సుమారు మూడు వందల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టిన సంఘటన నల్లగొండ పట్టణంలో కలకలం రేపింది.
నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు మూడు వేల మంది దాదాపు రూ. 330 కోట్లకు పైగా టువెల్త్ క్యాపిటల్స్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని లబోదిబోమంటున్నారు. కేవలం నల్లగొండ జిల్లా నుంచే సుమారు రూ.40 కోట్లకు పైగా పెట్టుబుడులు పెట్టినట్లు బాధితులు తెలిపారు. తాము పదవీ విరమణ చేయగా వచ్చిన డబ్బులు, ఇతర ఆస్తులు విక్రయించి సదరు సంస్థలో పెట్టుబడులు పెట్టామన్నారు. 25 నెలల తరువాత వారు ఇచ్చిన సమయం ముగిసినా వడ్డీ రాలేదని, నిర్వాహకులను అడిగితే ఇస్తామంటూ చెబుతూ కాలం వెళ్లదీశారన్నారు.
సమయం ముగిసినా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుండటంతో తాము మోసపోయామని అర్థమైందన్నారు. తమ వద్ద డబ్బులు తీసుకున్న ప్రకాశ్, సోమేశ్వరి, శ్రీనివాస్ అనే వ్యక్తులతో మాట్లాడేందుకు యత్నించగా వారు అడ్రస్ లేరన్నారు. సోమవార ప్రకాశ్ నల్లగొండలోని తన నివాసంలో ఉన్నట్లు తెలియడంతో ఇక్కడకు వచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బును తమకు చెల్లించాలని కోరగా పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫోన్ చేసి, అతని ఇంటి ఎదుట నిరసనకు దిగారు. రాపోలు ప్రకాశ్, సోమేశ్వరి ఇద్దరూ దుగ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఏజెంట్‌గా పెట్టుకొని తమ వద్ద డబ్బులు వసూలు చేసి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని బాధితులు ఆరోపించారు.
సోమేశ్వరి, ప్రకాశ్ పేరున ఉన్న ఆస్తులు స్వాధీనం చేసుకుని తమకు డబ్బులు చెల్లించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన విషయం తెలియడంతో నల్లగొండ టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడి అందోళన విరమించాలని కోరారు. వారు వినకపోవడంతో అందోళన కాస్తా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రాపోలు ప్రకాశ్‌ను ఆదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధితులు కూడా స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడారు. ఏదైనా చట్టప్రకారం పోవాలని, రోడ్లపై ఇండ్ల ఎదుట ధర్నాలు, నిరసనలు సరి కాదని హితవు పలికారు. దీంతో బాధితులు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు.
ఆస్తులు అమ్మి రూ.1.06 కోట్లు పెట్టిన : పద్మ
నాలుగు రూపాయల వడ్డీ ఇస్తున్నాం..పెట్టుబడులు పెట్టండి అంటే మేం నమ్మలేదు. సుమారు రెండు సంవత్సరాలు మా ఇంటి చుట్టూ తిరిగి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అయినా మేం నమ్మక పోవడంతో సోమేశ్వరి, ప్రకాశ్ ఇద్దరూ కలిసి జమానత్‌గా రూ.నాలుగు లక్షలకు ఒక గుంట చొప్పున రిజిస్టర్ చేస్తామని చెప్పారు. నారాయణఖేడ్, జోగిపేట, పెద్దకాపర్తి, చింతపల్లి గ్రామాల్లో భూములు ఉన్నాయని చెప్పడంతో నా కున్న ఆస్తులు అమ్మి రూ. 1.06 కోట్లు రాపోలు ప్రకాశ్ అనే వ్యక్తికి ఇచ్చిన. ప్రతి నెలా లక్షకు 16వేలు ఇస్తామని చెప్పారు. ఇలా 25 నెలలపాటు ఇచ్చిన తరువాత అసలు డబ్బులు ఇస్తామని చెప్పా రు. కానీ వారు చెప్పిన సమ యం కూడా అయిపోయింది. కానీ డబ్బులు ఇవ్వమంటే రేపు మాపంటూ తిప్పుతూ ఎక్కువ మా ట్లాడితే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.
నేను లీగల్ అడ్వైజర్‌ను మాత్రమే : రాపోలు ప్రకాశ్
నేను కంపెనీ డైరెక్టర్‌ను కాదు…కేవలం లీగల్ అడ్వైజర్‌ను మాత్రమే. నాకు బాధితులు పెట్టిన పెట్టుబడితో ఎలాంటి సంబంధం లేదు. వారు కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.. ఏమైనా లావాదేవీలు ఉంటే కంపెనీ డైరెక్టర్లతో మాట్లాడాలి. వారందరినీ పిలింపించి మాట్లాడండి… నాకు బాధితులు ఎవరూ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. నేను ఎవరితోనూ పెట్టుబడులు పెట్టమని చెప్పలేదు. నాకు వీరితో ఎలాంటి సంబంధం లేదు.
కేసు కోర్టు విచారణలో ఉంది..
అధిక వడ్డీ పేరుతో టూవెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ నిర్వహణ విషయంలో హైదరాబాద్‌లో కేసు నమోదైంది. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదై జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. రోడ్డుపై నిరసన చేయడం సరికాదు. ఏదైనా లీగల్ గానే ముందుకు పోవాలి.
-సైదులు, నల్లగొండ టూటౌన్ ఎస్సై