– జీవో నం.39ను రద్దు చేయాలి
– ఏఈఓలపై శాఖాపరమైన చర్యలు ఉపసంహరించుకోవాలి
– నల్లగొండ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్
నల్లగొండ రూరల్, ఆగస్టు 26 : వ్యవసాయ శాఖలో డిప్లొమా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల (AEO)కు గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇన్ సర్వీస్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షుడు అమరాజు లింగయ్య, జనరల్ సెక్రెటరీ మలావత్ రమేశ్ కోరారు. డిప్లొమా ఏఈఓలకు నష్టం కలిగించే జీవో.నం.39ను రద్దు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన టీఎన్జీఓ జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇటీవల కొంతమంది ఏఈఓలపై తీసుకున్న శాఖాపరమైన చర్యలను వెంటనే ఉపసంహరించుకుని, సంబంధిత ఉద్యోగులు ఇచ్చిన వివరణలను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
* డిప్లొమా AEOలకు గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న In-Service విధానాన్ని కొనసాగించాలి
* డిప్లొమా AEOలకు నష్టం కలిగించే GO No.39ను రద్దు చేయాలి
* డిప్లొమా AEOలకు ప్రమోషన్లు, కెరీర్ ప్రోగ్రెషన్ అవకాశాలు కల్పించాలి
* TNGO కేంద్ర సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన GAEO సంఘంపై తగిన చర్యలు తీసుకోవాలి
* AEOలపై ఇటీవల తీసుకున్న శాఖాపరమైన చర్యలను ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి, డిప్లొమా ఏఈఓలకు న్యాయం చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు కోరారు.