నల్లగొండ రూరల్,నవంబర్ 22: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంగా జరిగింది. ఈ ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం ఎన్జీ కళాశాల మైదానంలో సుమారు 2,500 కుర్చీలు ఏర్పాటు చేశారు. దీని కోసం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. భారీగా జనసమీకరణ కూడా చేశారు. నల్లగొండ పట్టణంలోని పలు హాస్టల్ విద్యార్థులను కూడా తరలించారు. అయితే సభలో ఎక్కువగా కాంగ్రెస్ కార్యకర్తలే కనిపించారు. అది కూడా నల్లగొండ నియోజకవర్గంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల ముఖ్య నాయకులు ఉన్నారు.
ఈ విజయోత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీఎల్ఆర్, వీరేశం హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించి అనంతరం రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్వరంలో నాటకం ప్రదర్శించారు. ఈ నాటకంలో ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లో చైతన్యం కల్పించే విధంగా రూపొందించారు. ఈ ఒక్క నాటకం అక్కడికి వచ్చిన విద్యార్థులకు బోర్ కొట్టి వెళ్లి పోతుండడంతో వెంటనే మంత్రి వెంకట్ రెడ్డి ప్రసంగించేలా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మంత్రి మాట్లాడే సమయానికి అక్కడ ఉన్న సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.