సూర్యాపేటలీగల్, జనవరి 27 : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ పుల్లా కార్తీక్ సూచించారు. శనివారం ఆయన జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయస్థానంలో కోర్టు సిబ్బంది పనితీరును పరిశీలించారు. కోర్టుకు వచ్చిన జడ్జికి పోలీసులు గౌరవ వందనం అందించారు.
అనంతరం సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.అమరావతి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులతో కలిసి కోర్టులను పర్యవేక్షించారు. ఆహ్వానం మేరకు న్యాయవాదుల విశ్రాంతి భవనంలో కొద్దిసేపు న్యాయవాదులతో మాట్లాడారు. కోర్టుల్లోని సమస్యలతో పాటు కొత్త కోర్టుల ఆవశ్యకతను జస్టిస్ కార్తీక్కు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.అశోక్ వివరించారు.
సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్జి వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూర్యాపేట, హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జీలు పి.శ్రీవాణి, జె.శ్యాంకుమార్, సూర్యాపేట జూనియర్ సివిల్ జడ్జీలు కె.సురేశ్, జె.ప్రశాంతి, కోదాడ న్యాయమూర్తులు భవియ్యకోహి, హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : పిల్లలమర్రి గ్రామంలో గల చారిత్రాత్మక శివాలయాలను హైకోర్టు జడ్జి పుల్లా కార్తీక్ సందర్శించారు. ఎరుకేశ్వర, నామేశ్వర, త్రికుటాలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు.