తిరుమలగిరి,నవంబర్ 15: ఈ సారి వానాకాల సీజన్ రైతులకు కలిసి రాలేదు. మొంథా తుపాను రూపంలో రైతులు కుదేలయ్యారు. చేతికి అందివచ్చిన వరి పంట పొలాల్లోనే మురిగి పోయింది. జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాలకు పైగా పంట నీటి మునిగింది .మరో 40 వేల ఎకరాల పంట నేలవాలింది. రైతులు ఆర్థి ఇబ్బందులతో సతమతమవుతుంటే మరో వైపు కోతదశలో నీటి మునిగి పొలాలు బురదతో నిండిపోవడంతో టైర్ హర్వెస్టర్లతో వరి కోతలు నడవక అన్నదాతలు ట్రాక్ మిషన్ల (చైన్ హర్వెస్టర్)తో వరి కోసే పరిస్థితి దాపురించింది. దీంతో రైతులపై అదనపు భారం పడింది.
కొద్ది పాటి వరి పంట కోయించకపోతే వడ్లు పొలాల్లోనే రాలిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు అవస్థలు పడి ట్రాక్ మిషన్ల యజమానుల చుట్టు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో టైర్ వరి కోత మిషన్లకు గంటకు రూ. 2500 ఉంటే ప్రస్తుతం చైన్ మిషన్లకు గంటకు 3500 నుంచి 4500 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలాలు దిగబాటుకు గురవుతుండటంతో గంటకు ఎకరం కోయాల్సిన మిషన్లు గంటన్నరకు పైగా కోస్తున్నాయి. దీంతో ఎకరానికి రూ.5 నుంచి రూ.6 వేల వరకు వరి కోత మిషన్లకే ఇవ్వాల్సి వస్తోంది. కోసిన ధాన్యం విక్రయించేందుకు ట్రాక్టర్లో తీసుకెళ్లటానికి మరో 2 వేలు ఖర్చు వస్తుంది. మొత్తంగా ఎకరాకు 8 వేలకు పైగానే రైతులకు ఖర్చవస్తోంది.
తగ్గిన వరి దిగుబడి..
ఈ సారి వరి దిగుబడి సగానికి పైగా తగ్గింది. నాణ్యమైన దిగుబడి వస్తే ఎకరాకు 55 క్వింటాళ్లే వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది. ధాన్యం తడిసి రంగు మారింది. ఇదే అదనుగా మిల్లర్లు రైతులను నిండా ముంచుతూ క్వింటాల్ ధాన్యం రూ. 1800 లకే కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేస్తే ఈ కాస్తా డబ్బులైనా వస్తాయో లేదో అనే అనుమానంతో రైతులు వ్యాపారులకే ధాన్యం అమ్ముతూ నష్టపోతున్నారు.ఈ విధంగా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో సవాలక్ష నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో రైతులు వ్యాపారులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు.
గతంలో ఎకరాల్లో కోసే మిషన్లు , నేడు గంటల్లో కోస్తున్నాయి.
గతంలో వరి కోత మిషన్లు ఎకరాకు 2 వేల చొప్పున కోసేవి. కానీ గత 5 సంవత్సరాలుగా గంటకు ఎకరం చొప్పున కోస్తూ రైతులను దగా చేస్తున్నాయి. వరి కోత మిషన్ వరి చేలో దిగినప్పటి నుంచి లెక్కకడుతూ, దిగబాటుకు గురైనా లేక ఇతర కారణాల వల్ల ఆలస్యమైనా లెక్కకడుతూ రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మిషన్లు కూడా చిన్నగా నడుపుతూ ఎక్కువ సమయం వచ్చే విధంగా యజమానులు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తప్పని పరిస్థితుల్లో వారిని ఆశ్రయించక తప్పటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ..
వరి పంట విషయంలో పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ఎకరాకు దాదాపు 35 వేలకు పైగా పెట్టుబడి ఖర్చు వస్తోంది. కాలం కలిసి రాకుంటే ప్రతికూల పరిస్థితులను తట్టుకోని వ్యవసాయం చేసి అప్పుల పాలవుతున్నారు. రైతు ఎకరం వరి సాగు చేయాలంటే భారీమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సివస్తుంది.
ఎకరా వరి సాగుకు అయ్యే ఖర్చు రూ.35 వేలకు పైనే.. దున్నకం, విత్తనాలు, గొర్రు తోలటం, వరాలు తీయటం 10,000. నాటు వేయటం, కలుపు మందు, కలుపు తీయటం 8,000.2 యూరియా, 2 డీఏపీ, గుళికల ప్యాకెట్, సస్య రక్షణ మందులు 6000 వరి కోత, ధాన్యం మార్కెట్కు తరలింపు, తదితర ఖర్చులు రూ.10వేలతో కలిపి మొత్తంగా రూ.35 వేలకు పైగా రైతుకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎకరాకు 20 క్వింటాళ్లకు మించటం లేదని రైతులు వాపోతున్నారు. తడిసి రంగు మారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా కొనుగోలు చేయక పోవటం, పొంతన లేని నిబంధనలు పెట్టడంతో క్వింటాకు రూ. 1800 నుంచి 1900 వరకే విక్రయించక తప్పటం లేదు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇక కౌలు రైతులైతే మరింత ఇబ్బందులు పడుతున్నారు.
32 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది..
మాది నాగారం మండలం వర్దమానుకోట. నేను రెండెకరాల 30 గుంటల్లో వరి సాగు చేసా. రూ. 70 వేలు పెట్టుబడి ఖర్చు వచ్చింది. 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాస్తవానికి మంచి దిగుబడి వస్తే ఎకరాకు 45 క్వింటాళ్లు రావాలి .కానీ ఈసారి దిగుబడి తగ్గింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే రూ.76 వేల 352 రూపాయలు వచ్చాయి. పెట్టుబడి ఖర్చులు పోను 6,352 రూపాయలు మిగిలాయి. రాత్రింబవళ్లు కుటుంబం మొత్తం కష్టపడితే శ్రమంతా వృధా అయింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
-బుర్ర నరేశ్, వర్దమానుకోట, నాగారం