నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ వేగంగా నిండుతున్నది. 24 గంటల్లోనే 15 అడుగుల మేర నీటి మట్టం పెరగ్గా, అదనంగా 33 టీఎంసీల నీరు వచ్చి చేరింది. వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశాలు మెండుగా ఉండడంతో నేటి రాత్రికి గానీ, రేపు ఉదయానికి గానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయి.
ఇదే జరిగితే రెండేండ్ల తర్వాత సాగర్ గేట్లు ఎత్తినట్టు అవుతుంది. శనివారం సాయంత్రానికి కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా వస్తున్నది. దాంతో శ్రీశైలం క్రస్ట్‌గేట్లలో 10 గేట్లను 20 అడుగల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు 4.94లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తున్నది. తద్వారా సాగర్ రిజర్వాయర్ వేగంగా నిండుతున్నది.
శనివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 565 అడగులకు చేరుకోగా, మొత్తం నీటినిల్వ సామర్ధ్యం 244.14 టీఎంసీలకు నీరు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా, నీటి సామర్ధ్యం 312 టీఎంసీలు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 24 గంటల్లోనే 15 అడుగల మేర నీటిమట్టం పెరిగి 33 టీఎంసీల నీరు అదనంగా వచ్చి చేరింది.
ఆదివారం కూడా ఇదేవిధంగా వరద కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేటి సాయంత్రానికి 575 అడుగుల పైకి పెరుగవచ్చని అంచనా. ఇప్పటికే సాగర్ నుంచి ఎడమ, కుడి కాల్వలు, ఏఎమ్మార్పీ, లోలెవల్ కెనాల్‌కు సాగునీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. వీటన్నింటి ద్వారా సాగర్ నుంచి అవుట్‌ఫ్లోగా 39,741 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.