నేరేడుచర్ల, మే 24 : 2008 సంవత్సరంలో పలువురు డీఎస్సీ అర్హత సాధించారు. రకరకాల కారణాలతో పోస్టింగ్ ఇవ్వడం ఆలస్యం జరిగింది. సుమారు 15 ఏండ్ల తర్వాత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి అందే వేతనాలు కావడంతో జీవనానికి భరోసా ఉంటుందని ఎంతో ఆశతో భావించారు. దీంతో అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలు మాని ఉపాధ్యాయులగా విధుల్లో చేరారు. కానీ ఒక్కటి కాదు రెండు కాదు.. నాలుగు నెలలైనా వచ్చే అరకొర వేతనం కూడా చెల్లించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నింటికీ సర్దుకుపోతున్నా తమకు అందాల్సిన వేతనాల్లో జాప్యం చేయడంపై కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో 2008 డీఎస్సీ అర్హత సాధించిన 49 మంది అభ్యర్థులను 16 ఏండ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లోకి తీసుకున్నారు. మండలానికి ఒక్కరు లేదా ఇద్దరికి చొప్పున పోస్టింగ్ ఇచ్చారు. వీరు జిల్లాలోని వివిధ పాఠశాలలో పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నెలల పాటు ఉంటున్న ప్రాంతం నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చినా నెలనెలా వేతనాలు మాత్రం రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే విద్యా సంవత్సరం చివరిలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. వేతనాల విషయమై స్పష్టత ఇవ్వలేకపోతున్నప్పటికీ మళ్లీ పాఠశాలలు తెరవగానే వారిని విధుల్లోకి తీసుకునే అవకాశముందని చెబుతుండడంతో కొంత మేర ఊరట కలిగిస్తున్నది.
డీఎస్సీలో అర్హత సాధించి 16 ఏండ్ల తర్వాత ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరిన సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు. ఎంతో ఆశతో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వారికి మాత్రం వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఒక్కొకరికి నాలుగుల నేలల వేతనాలు రావాలి. సక్రమంగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. కనీసం ఇంట్లో వంట సరుకులు సైతం తెచ్చకోలేని పరిస్థితి ఉందని పలువురు కాంట్రాక్ట్ ఉపాధ్యాయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని పెండింగ్ వేతనాలు మొత్తం ఒకేసారి విడుదల చేయాలని కోరుతున్నారు.