మిర్యాలగూడ, జూన్ 23: లక్కి డ్రీం స్కీం పేరిట బడుగు జీవులను బురిడి కొట్టాంచారు. నెలకు రూ.1000 చెల్లించి చేరితో డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చన్న మాయమాటలతో అమాయక ప్రజలను నమ్మించి శఠగోపం పెట్టారు. ఈ ఘటన పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరిట రమేశ్, బచ్చలకూరి శ్రీనివాస్, కోటేశ్వర్రావు స్కీం ప్రారంభించారు. వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాలతోపాటు ఏపీ సరిహద్దు గ్రామాల్లో ఏజెంట్లను చేర్చుకొని ఒక్కో సభ్యుడి నుంచి నెలకు రూ.1000 చొప్పున వసూలు చేశారు. 15 నెలలపాటు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 2,600 మంది సభ్యులను చేర్చుకొని ప్రతినెలా డ్రా తీసి పది మందికి రూ.15వేల విలువైన వస్తువులు అందచేస్తూ వచ్చా రు. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన లక్కి డ్రా స్కీం ఈ ఏడాది జనవరిలో ముగిసింది.ఇప్పటివరకు 150 మందికి చెల్లింపులు జరిపిన నిర్వాహకులు ఆ తరువాత ఎత్తివేశారు.
దీంతో సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లను నిలదీయడంతో అసలు విషయం బయటపడి పోలీసులను ఆశ్రయించారు. చైన్ పద్ధతిలో నడిచే ఈ స్కీంలో సుమారు రూ.4కోట్ల వరకు వసూలు చేశారు. చెల్లింపులు జరపకపోవడం, బంపర్ డ్రా తీయకపోవడంతో అనుమానించిన వెంకటమ్మ ఏజెం ట్లు మందారి మల్లేశ్వరి, నిర్వాహకుడు రమేశ్‌పై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న మిగ తా బాధితులు సైతం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వేడుకున్నారు. ఒక్క మిర్యాలగూడలోనే సుమారు 900 మంది బాధితులు బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిర్వాహకుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ మోతీరాం తెలిపారు.