చండూరు, నవంబర్ 21 : కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ నెల 28న సూర్యాపేటలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు నలుమూలల నుండి గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని కల్లుగీత కార్మిక సంఘం చండూరు మండల అధ్యక్షుడు తాందారి యాదయ్య గౌడ్, మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం చండూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మహాసభలో రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టింపు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని, ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల వేయాలన్నారు. నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భిక్షమయ్య, అనంత రాములు, ఎల్లయ్య, వెంకటేశం, సీహెచ్.యాదయ్య పాల్గొన్నారు.