యాదగిరిగుట్ట, మార్చి 27 : ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో జరిగే అధికార కార్మిక ఎన్నికల్లో బీఎంఎస్ బలపర్చిన బీఆర్ఎస్కేవీ గెలిపిస్తే ప్రతి కార్మికుడికి రూ.18వేల వేతన ఒప్పందాన్ని సాధిస్తామని బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో గురువారం బీఆర్ఎస్కేవీ గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గతంలో 10,11వ వేతన ఒప్పందాల్లో బీఆర్ఎస్కేవీ కార్మికులు మెచ్చే వేతన ఒప్పందాన్ని సాధించిందని గుర్తుచేశారు.
తమ సొంత నిధులతో రెండేండ్లపాటు హెల్త్ ఇన్సూరెన్స్ అందించామన్నారు. 10వ వేతన ఒప్పందంలో ఈఎస్ఐ కోల్పోయిన కార్మికులకు సంవత్సరానికి రూ.2 లక్షల వైద్య బీమాకు రూ.3,984 ఇప్పించామన్నారు. 11వ వేతన ఒప్పందంలో గరిష్టంగా రూ. 5,267, కనిష్టంగా రూ 5,230 వరకు వేతనాలు సాధించామని తెలిపారు. రెండు అగ్రిమెంట్లు కలుపుకొని రూ.11,517 వరకు జీతభత్యాలను పెంచి కార్మికులకు దన్నుగా నిలిచినట్లు పేర్కొన్నారు. శిక్షణలో కార్మికులకు రూ.5వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం పెంచామన్నారు.
జూనియర్ కార్మికులకు యజమాన్యాన్ని ఒప్పించి అగ్రిమెంట్‌ను వర్తింపజేసి, ఏరియల్స్‌ను సాధించిన ఘనత బీఆర్ఎస్కేవీకే దక్కుతుందన్నారు. రూ.1,500 ఉన్న ఫెస్టివల్ అడ్వాన్స్‌ను రూ.6,500 వరకు పెంచామన్నారు. గతంలో కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఒక ఉద్యోగం, రూ.20 లక్షల నష్టపరిహారం మాత్రమే ఇప్పించారని, బీఆర్ఎస్కేవీ నాయకత్వంలో రూ.35 లక్షల పరిహారంతోపాటు కుటుంబానికి రెండు ఉద్యోగాలు ఇప్పించామని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్కేవీకి అవకాశం ఇస్తే కార్మికుల శ్రేయస్సు కోసం రెట్టింపు ఉత్సాహంతో 12వ వేతన ఒప్పందాన్ని సాధిస్తామన్నారు.
ప్రతి కార్మికుడికి రూ. 16 వేల వేతన ఒప్పందంతోపాటు స్టాఫ్ కార్మికులకు అదనంగా రూ.600 అందజేసేలా కృషి చేస్తామన్నారు. ఈఎస్ఐ పరిధి దాటిన ప్రతి కార్మికుడి కుటుంబానికి సంవత్సరానికి రూ.7 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పూర్తిగా యజమాన్యమే భరించేలా చూస్తామని తెలిపారు. అర్హులైన కార్మికులందరికీ పదోన్నతులు సాధిస్తామన్నారు. వీడీఏ పాయింట్ ప్రస్తుతం ఉన్న 2 రూపాయల నుంచి 3కి, ఎల్‌టీఏ రెట్టింపు వచ్చేలా పని చేస్తామన్నారు.
పండుగ సెలవులు, ఎస్ఎల్, సీఎల్స్ మంజూరుకు పాటుపడుతామని పేర్కొన్నారు. స్టాఫ్, వర్కర్స్ రిటైర్మెంట్ సమయంలో ఒక నెల వేతనాన్ని గిఫ్ట్‌గా అందించేందుకు ప్రయత్నతిస్తామని తెలిపారు. మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, మెరుగైన మౌలిక సౌకర్యాలను కల్పిస్తామన్నారు. పీఈఎల్ యజమాన్యాన్ని ఒప్పించి కార్మికుల పక్షాల నిలిచే బీఆర్ఎస్కేవీ బాణం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు చెన్నకేశవరావు, గౌరవాధ్యక్షుడు వై.రాజిరెడ్డి, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి నాగేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలంధర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాంబాబు, జిల్లా సెక్రటరీ జోగిరెడ్డి, కోశాధికారి ఎల్లగౌడ్, బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం ప్రధాన కార్యదర్శి బరిగే నర్సింహులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, డిప్యూటి సెక్రటరీ పాపయ్య, కోశాధికారి గవ్వల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గట్టికొప్పుల లక్ష్మీనర్సయ్య, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.