బొమ్మలరామారం, సెప్టెంబర్ 23 : కరెంట్ వైర్లు, ట్రాన్స్ఫారమ్లో కాపర్ వైర్ దొంగతనం చేస్తున్న బీహార్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను బొమ్మలరామారం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భువనగిరిలో డీసీపీ రాజేశ్చంద్ర సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. బొమ్మలరామారం ఎస్ఐ శ్రీశైలం అధ్వర్యంలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున చీకటిమామిడి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా తుర్కపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలను అనుమానంతో సోదా చేశారు.
వాటిల్లో కరెంట్ వైర్లు, కాపర్ తీగలు దొరికాయి. దీంతో బీహార్‌కు చెందిన 8మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి విచారించగా దొంగతనాలు బయటపడ్డాయి. వారు 46 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 2.73లక్షల నగదు, రెండు కార్లు, ఆటోట్రాలీ, 8సెల్ఫోన్లు, 200కిలోల కాపర్, అల్యూమినియం తీగలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రం దర్బాంగా జిల్లా సన్కార్ గ్రామానికి చెందిన బిక్రమ్‌సింగ్ (33) హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
చెడు వ్యసనాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాను ఏర్పాటు చేశాడు. బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా మెటోటి గ్రామానికి చెందిన మహేందర్రామ్ (30) వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. మేడ్చల్ రంగారెడ్డి జిల్లా జిడిమెట్ల గ్రామానికి చెందిన రామ్‌కుమార్‌సింగ్(24) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జార్ఖండ్ రాష్ర్టం గోడ్డా జిల్లా లకర్మర గ్రామానికి చెందిన గోవింద్ మండల్(25) హైదరాబాద్‌లో కూలి పని చేస్తున్నాడు. బీహార్ రాష్ట్రం చప్రా జిల్లా బజీయా గ్రామానికి చెందిన శ్రావణ్ మహాతో (28) హైదరాబాద్‌లోని జీడిమెట్లలో కూలీగా పనిచేస్తున్నాడు.
బీహార్ రాష్ట్రం కైమూర్ జిల్లా నివే గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్ మిశ్రా(24) కుత్బుల్లాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లా చందన్బారీ గ్రామానికి చెందిన రాజ్కుమార్రాయ్(30) జీడిమెట్లలో కూలీగా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన అమిత్ (28). వీరంతా ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారిని అరెస్టు చేసి భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. కేసును చేధించిన ఎస్ఐ శ్రీశైలం, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, రాజు, నాగార్జున, మెహబూన్ను డీజీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.