శాలిగౌరారం, జూలై 28 : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్ అధ్యక్షతన సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కిశోర్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిందని విమర్శించారు. పోలీస్స్టేషన్లు వేదికగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సెటిల్మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీని ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష గట్టి కేసులు పెడుతోందన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతోపాటు తులం బంగారం ఎక్కడ పోయిందన్నారు.
దివ్యాంగులకు, వృద్ధులకు పెంచి ఇస్తామన్న పింఛన్లపై ఇంత వరకు నోరుమెదపడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ లాంటి పథకాలకు తూట్లు పొడిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు ఎక్కడని గాదరి కిశోర్‌కుమార్ ఎంపీపై ఫైర్ అయ్యారు.
సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి చాడ సతీశ్‌రెడ్డి, సీనియర్ నాయకుడు కట్టా వెంకట్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు కల్లూరి నాగరాజుగౌడ్, గుజిలాల్ శేఖర్‌బాబు, జెర్రిపోతుల చంద్రమౌళీగౌడ్, దుబ్బ వెంకన్న, చివుట సైదులు, అక్కెనపల్లి శ్రీరాములు, భూపతి ఉపేందర్‌గౌడ్, వేమిరెడ్డి నర్సిరెడ్డి, దాసరి వెంకన్న, గుండ్లపల్లి రవీందర్, మామిడి రమేశ్, చింతల శంకర్, బైరు నాగరాజు గౌడ్ ఉన్నారు.