నల్లగొండ, మే 2 : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థుల్లో మరింత మందికి గుత్తా వెంకట్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రస్టు చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండు నెలలపాటు గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చామన్నారు. మరోసారి ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరారని, కొందరు భౌతికంగా, మరికొందరు ఆన్లైన్లో ఇవ్వాలని కోరారని తెలిపారు. వారి కోరిక మేరకు ఈ నెల 7నుంచి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రధానంగా గ్రూప్స్ ప్రవేశ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని నల్లగొండలోని టీఎన్జీఓస్ భవన్లో మరోసారి శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాలవారు ఆన్లైన్లో ఇవ్వాలని కోరగా హైదరాబాద్‌లోని చక్రవర్తి ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ లర్నింగ్ యాప్ క్రియేట్ చేసి దానికి నల్లగొండ యువతరం అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో నల్లగొండ వారికి మాత్రమే శిక్షణ ఇవ్వనున్నామని, దీన్ని కూడా ఈ నెల 7న ప్రారంభిస్తామని చెప్పారు. ఈ యాప్ ద్వారా తరగతులు వినాలనుకునేవారు పూర్తి వివరాలిస్తే తాము ఇచ్చే లింక్ ద్వారా ఏడాదిపాటు ఆర్థమెటిక్తోపాటు రీజనింగ్ తరగతులు వినవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ వేసే అన్ని ఉద్యోగాలకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. సమావేశంలో మునాస వెంకన్న, దుబ్బ అశోక్‌సుందర్, ఐతగోని స్వామిగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎల్లమ్మ ఆలయంలో పూజలు
కనగల్ : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.