నల్లగొండ ప్రతినిధి, జూలై 20 (నమస్తే తెలంగాణ): సూపర్ ఎల్‌నినో ప్రమాదం పొంచిఉందని కొన్ని నెలలుగా పర్యావరణ వేత్తలు, సంస్థలు, ఇతర వ్యవస్థలు హెచ్చరిస్తున్నా..ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు రాబోతున్నట్లు ముందే హెచ్చరికలు జారీ చేసినా..ప్రభుత్వం అందుకు అనుగుణంగా సన్నద్ధం కాలేదు…కనీసం ప్రజలకు దీనిపై అవగాహన కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు సన్నద్ధతపై సకాలంలో సమీక్ష చేయాలన్న కనీస సోయి, తెలివి కూడా సీఎం, మంత్రులకు లేదన్నారు.
కరువు కమ్ముకుంటున్న వేళ సమీక్ష సమావేశాలంటూ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో సూపర్ ఎల్‌నినో సన్నద్ధతపై జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అత్యవసరమంటూ ఏర్పాటు చేసిన సమావేశంలో కరువుపై సీరియస్‌గా చర్చ జరుగుతుందనుకుంటే ఏమీ లేదన్నారు.
సమావేశంలో ఇంకుడు గుంతలు, పాంపాండ్ల నిర్మాణమం టూ సాగిన చర్చతో ప్రభుత్వ చిత్తశుద్ధిలేమి, బాధ్యతారాహిత్యం బహిర్గతమైందన్నారు. మరో పక్షం రోజుల్లో కరువు తీవ్ర రూపం దాల్చుతుందనగా నిర్వహించిన ఈ సమీక్షను చూస్తుంటే దప్పిక వేసినప్పుడే బావి తవ్వకుందామన్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండ్ల ముం దే వృథాగా పారుతున్న నీటిని వాడుకునే సోయి లేదు…చెప్తే నేర్చుకునే విజ్ఞత కూడా లేని ప్రభుత్వమని మండపడ్డారు. కన్నెపల్లి పంపుహౌస్‌ను ఈరోజు ప్రారంభించినా రాష్ట్రంలోని ఏడు జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలోని చిట్టచివరి రావిచెర్వు వరకు నీరు పారించవచ్చని సూచించారు.
కానీ చంద్రబాబు వారసుల పాలనలో అక్కడి ప్రయోజనాలే తప్ప ఇక్కడి ప్రజల గురించి పట్టడం లేదన్నారు. 2015లో కేసీఆర్ హయాంలో కరువు పరిస్థితులు నెలకొంటే పూర్తిగా అప్రమత్తమై పనిచేశామని గుర్తు చేశారు. సాగర్ ఎడమకాల్వ ద్వారా చెరువులు నింపామని, తాగునీటి పేరుతో నీటిని తీసుకొని పంటలను కాపాడిన చరిత్ర కేసీఆర్ సర్కార్దేన్నారు. ఇవ్వాళ ప్రభుత్వం కనీసం మిషన్ భగీరథ నీళ్లను సైతం సక్రమంగా ఇవ్వలేకపోతున్నదని, కేసీఆర్ హయాంలో వరుసగా ఐదేండ్లు అద్భుతంగా ఇంటింటికి నీళ్లు ఇచ్చి చూపామన్నారు.
వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చామన్నారు. ఉన్న వ్యవస్థలను కూడా వాడుకునే కనీస జ్ఞానం, తెలివి కూడా సీఎం, మంత్రులకు లేదని విమర్శించారు. చంద్రబాబు వారసులు ప్రభుత్వం నడుపుతుండటంతో ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి నీళ్ల దోపిడీ చేస్తున్నా కండ్లు మూసుకున్నారన్నారు. 50 టీఎంసీలకు పైగా తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటుంటే బీఆర్ఎస్ దీనిపై ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఉన్న నీటితో ఎడమ కాల్వ ద్వారా చెరువులు నింపాలని, రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇప్పుడు హడావుడి చేస్తే ఎట్లా…
కరువు తీవ్ర రూపం దాల్చుతుంటే ఇప్పుడు ఆరుతడి పంటలు వేయాలని మంత్రులు చెప్తుండడం సిగ్గుచేటన్నారు. ఎప్పుడైనా వ్యవసాయం చేసినోళ్లు అయితే రైతుల ఇబ్బందులు తెలిసేవని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 2014 నాటికి ఏడెనిమిది లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే కేసీఆర్ హయాంలో 24 లక్షల ఎకరాలకు చేరుకుందని గుర్తు చేశారు. ఇప్పటికే లక్ష ఎకరాల్లో వరి సాగైందని మంత్రులే చెప్తున్నారని, మరి మిగతా 23 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారా అని ప్రశ్నించారు. మంత్రుల్లో ఒక్కరికీ వ్యవసాయం రాదు.
పంటల గురించి తెలియదు. ఇప్పుడు పెసర్లు వేసే సమయమా? ఇప్పుడ వేస్తే పండుతాయా? అని మండిపడ్డారు. కృష్ణానది నుంచి ఎడమ కాల్వ ద్వారా నీళ్లన్నీ మనమే వాడుకునేలా చర్యలు చేపట్టాలని, తక్షణమే ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. తక్షణమే కన్నెపల్లి పంపుహౌస్‌ను ఆన్‌చేస్తే సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని ఇవ్వొచ్చన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినప్పుడే ప్రజలకు కరువు నుంచి ఉపశమనం కలుగుతుందని హితవు పలికారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నేతలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, మారగోని గణేశ్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, ప్రవీణ్‌రెడ్డి, దీప్లా నాయక్, దొడ్డి రమేశ్, కొండూరి సత్యనారాయణ, రావుల శ్రీనివాసరెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, జమాలుద్దీన్ ఖాద్రీ, సయ్యద్ జాఫర్, మెరుగు గోపి, కందుల లక్ష్మ య్య, రాపోలు వెంకన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.