సూర్యాపేట, మే 15: ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్త శుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన తూర్పు తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సులో ఆయన మాట్లాడారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడి పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక సంస్థల పనితీరును కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వివరించారు.
నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి వీపాలు, తడిపొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్నుల వసూలు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో ప్రతి గృహానికి రక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ కొనసాగేలా స్థానిక సంస్థలు నిశితంగా పర్యవేక్షించాలన్నారు. సర్పంచ్‌లు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.