హుజూర్నగర్, మే 20 : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గన్న చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎరువులు, ఇతర అవసరాలు తీర్చాలని కోరారు. రైతులకు ఉపయోగపడే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లవుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, గాంధీ, రమణ పాల్గొన్నారు.