గుర్రంపోడు, ఆగస్టు 28 : గుర్రంపోడు మండలంలోని రైతులు తాము పండించిన పంటను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమం మొదలైందని రైతులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టే సిబ్బందికి పూర్తి సహయ సహకారాలు అందించి తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. సన్న వరి రైతులకు బోనసు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పోడిగించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ కేవలం ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వడ్లు బిపిటి – 5204, కెఎన్ హేచ్ – 1638, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా,కెఎన్ఎం 7715,జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్-44 లకు మాత్రమే ఇస్తుందని తెలిపారు. రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన ఎరువుల దుకాణంలోనే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సొంతంగా సన్నరకాల వడ్లు సాగు చేసుకునే రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.