“మీరు లేకపోతే నేను లేను. మీరు లేకపోతే తెలంగాణ లేదు. మీరే నా బలం, బలగం. నన్ను నడిపించే శక్తి మీరు” అంటూ కార్యకర్తలనుద్దేశించి చెప్పే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి కుటుంబాలను సైతం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కష్ట సమయంలో బాధ్యతను భుజానికెత్తుకుంటూ పెద్దన్నగా నిలుస్తున్నారు. తెలంగాణ కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినా, సాధించుకున్న స్వరాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎనలేని భరోసాను అందిస్తున్నారు. గత పార్టీలు కార్యకర్తలను తమ స్వార్ధానికి ఉపయోగించుకున్నాయే తప్ప వారి యోగక్షేమాలను పట్టించుకున్నది లేదు. బీఆర్ఎస్ మాత్రం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకూ రూ.2లక్షల ప్రమాద బీమా చేయిస్తున్నది. అదే ఆపత్కాలంలో ఆయా కుటుంబాలను తిరిగి నిలబెడుతున్నది. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో మొదలైన ఈ పథకం మధ్యలో ఒక ఏడాది మినహా ఏటా అమలవుతూనే ఉన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 500 కుటుంబాల వరకు ప్రమాద బీమా అందినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటుండగా, ఆ కుటుంబాలు సీఎం కేసీఆరే తమ ఇంటి దేవుడని కృతజ్ఞతలు చెప్తున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆరు లక్షల మంది సభ్యులతో తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇందులో క్రియాశీలక సభ్యుల కోసం పార్టీ తరఫున రూ.2లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. 69 సంవత్సరాల్లోపు వయసున్న 10 రూపాయలతో పార్టీ సభ్యత్వం స్వీకరించిన ప్రతి క్రియాశీలక సభ్యుడికీ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. సభ్యత్వ సమయంలోనే వీరికి సంబంధించిన నామినీతో సహా పూర్తి వివరాలను సేకరించి పార్టీ ఇన్సూరెన్స్ విభాగానికి పంపిస్తున్నారు. అక్కడ బీమా కంపెనీ నిబంధనల ప్రకారం వివరాలు అందజేస్తూ ప్రీమియం మొత్తాన్ని కూడా పార్టీనే ప్రతి యేటా చెల్లిస్తున్నది. ఇలా బీమా పొందిన సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే రెండు లక్షల ఇన్సూరెన్స్ అందుతున్నది. చనిపోయిన వారి వివరాలను 60 రోజుల్లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తున్నారు. దీని ప్రకారం సాధ్యమైనంత త్వరగా నామినీ పేరుతో రూ.2లక్షల చెక్కును సంబంధిత కుటుంబానికి పార్టీ ఎమ్మెల్యేలు లేదా ముఖ్యులు ఆయా నియోజకవర్గాల్లో అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 500 ప్రమాద బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున మొత్తం రూ.10కోట్ల వరకు బీమా చెల్లింపులు జరిగినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఆపద సమయాల్లో పార్టీ కుటుంబాలకు ఆర్థికంగా భరోసానిచ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నది. దీనికితోడు ప్రమాద సమయాల్లో వైద్య చికిత్సల ఖర్చుల కోసం సామాన్య ప్రజల్లో భాగంగా పార్టీ కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీలు కూడా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. దీంతో పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు మనోధైర్యం కల్పించినైట్లెంది. పార్టీ కోసం పనిచేస్తే.. ఆపద సమయాల్లో పార్టీ అండగా ఉంటుందన్న భరోసా బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని శ్రేణులు కొనియాడుతున్నారు. ఏ పార్టీలోనూ ఇలాంటి సౌకర్యం లేదని, ఇతర పార్టీల నేతలు క్యాడర్‌ను కరివేపాకులా చూస్తున్నారని పేర్కొంటున్నారు.
అన్ని విధాలుగా ఆసరా..
ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కుటుంబాలు రోడ్డు పాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితి రావద్దనే పార్టీ అధినేత కేసీఆర్ ముందు చూపుతో బీమా సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఆపత్కాలంలో భరోసాగా నిలువాలని రూ.2లక్షల ఇన్సూరెన్స్ అందిస్తున్నారు. దీని ద్వారా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకుంటున్నది. తీవ్ర ఇబ్బందుల నుంచి బయట పడేస్తున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నది. బీమా డబ్బుతో గతంలో ఉన్న అప్పులు తీర్చుకుంటున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంటి అవసరాలు, పొలం పనులకు ఖర్చు చేస్తున్నారు. ఇలా అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు.
బీమా డబ్బుతోనే పిల్లల చదువులు
మాది యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట. నా భర్త మేకల భిక్షపతి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో తిరిగేవాడు. పార్టీ అంటే ఆయనకు ప్రాణం. ఎక్కడ మీటింగ్ ఉన్నా పోయేటోడు. మూడేండ్ల కింద కరెట్ తగిలి చనిపోయిండు. పెద్ద దిక్కును కోల్పోయిన చాలా ఇబ్బందులు పడ్డాం. మా ఆయనకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడం
వల్ల పార్టీ ఇన్సూరెన్స్ చేసింది. నామినీగా ఉన్న నాకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మూడు నెలలకే 2లక్షల రూపాయల చెక్కును అందించారు. నాకు ఇద్దరు కూతుళ్లు. బీమా డబ్బును పిల్లల చదువులకు ఖర్చు పెడుతా. కార్యకర్తలకు కుటుంబానికి అండగా నిలిచి ఆదుకుంటున్న దేవుడు సీఎం కేసీఆర్.
– మేకల నాగ, మాసాయిపేట గ్రామం, యాదగిరిగుట్ట మండలం
చిన్నారుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశా
మా బాబు ఉపేందర్ రెండేండ్ల క్రితం యాదగిరిగుట్టలో భవనం మీద కూలి మృతిచెందాడు. ఆయనకు ఇద్దరు బిడ్డలు కిరణ్మయి, దీక్షిత. రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబం మాది. చిన్నతనంలోనే మా బాబు చనిపోవడం బాధగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ చరుకుగా పనిచేశాడు. పార్టీ బీమా కింద రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే సునీతమ్మ ఇచ్చారు. ఆ డబ్బును పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. పార్టీలో పనిచేసిన వారికి ఆదెరువుగా ఉండడం సంతోషకరం.
– సుంకి లక్ష్మమ్మ, యాదగిరిగుట్ట పట్టణం
సీఎం కేసీఆర్ పెద్దదిక్కులా ఆదుకున్నరు..
నా భర్త లింగస్వామి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండేటోడు. 2016 లో నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో నాకు రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కు వచ్చింది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగకండా ఇలాంటి ఇన్సూరెన్స్ పెట్టడంతో కొంతైనా ఆసరైంది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– కాసర్ల రేణుక, అప్పాజీపేట,నల్లగొండ మండలం
బీఆర్ఎస్ జెండా మోసినందుకు ఇన్సూరెన్స్ ఇప్పించిండ్రు
నా భర్త కల్లూరి మల్లేశం మా గ్రామంలోని ఓ క్రషర్లో కూలి పని చేసేవాడు. నాలుగు సంవత్సరాల క్రితం పని చేస్తుండగా బెల్ట్ మీద నుంచి మిషన్‌లో పడి చనిపోయాడు. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద దిక్కు కోల్పోయిన మా కుటుంబానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో పార్టీ బీమా డబ్బు రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులు మా కుటుంబానికి ఎంతో ఆసరా అయ్యాయి. పార్టీలో తిరిగినోళ్లకు ఏమైనా అయితే ఇట్ల కూడా పైసలు ఇవ్వడం మంచి పని. నా భర్త ఇప్పటివరకు ఎల్ఐసీ కూడా కట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ జెండా మోసినందుకు ఎమ్మెల్యే సహకారంతో కేసీఆర్ సారు ఇన్సూరెన్స్ ఇప్పించిండ్రు. పైసలు లేని సమయంలో పార్టీ వాళ్లు ఇచ్చిన బీమా డబ్బులు మా కుటుంబాన్ని ఆదుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– కొల్లూరి లలిత, పిల్లాయిపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం
బీఆర్ఎస్కు జీవితాంతం రుణపడి ఉంటా..
నా భర్త బండారి నరేశ్‌కు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాణం. ఎక్కడ పార్టీ మీటింగ్ ఉన్నా.. ఇంట్లో పని వదిలి వెళ్లేవాడు. అయితే.. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటికి మాకు ముగ్గురు చిన్న పిల్లలు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. కుటుంబ పోషణ కష్టంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ.2లక్షలు, నా భర్త పేరు మీద ఎకరం భూమి ఉండగా రైతు బీమా కింద రూ.5లక్షలు వచ్చాయి. వాటితో కొంత ఉపశమనం కలిగింది. పిల్లల చదువులకు, కుటుంబ పోషణ మెరుగుపడింది. ఆపదలో ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటా.
– బండారు రాణి, చౌళ్లరామారం, అడ్డగూడూరు మండలం
కుటుంబ పెద్దను కోల్పోయిన మాకు బీఆర్ఎస్ అండగా నిలిచింది..
మాది పేద కుటుంబం. ఎలాంటి ఆస్తులు లేవు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. మేము వడ్డెరోళ్లం. కుల వృత్తిని నమ్ముకొని ఇంటిల్లిపాది రాళ్లు కొట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాం. మా ఆయన కుంచ శ్రీనుకు సీఎం కేసీఆర్ అంటే పాణం. అందుకే బీఆర్ఎస్లో చేరిండు. ఒకరోజు మా ఆయన బైకుపై మిర్యాలగూడకు పోయి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం అంతిమ సంస్కారాలు చేసే స్థోమత కూడా లేదు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న మా వద్దకు బీఆర్ఎస్ నాయకుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మా గ్రామ సర్పంచ్ భర్త శ్రీనివాస్ వచ్చి మీ ఆయనకు పార్టీ తరఫున ఇన్సూరెన్స్ చేయించామన్నారు. రూ.రెండు లక్షలు వస్తాయి.. మీరేమీ ఇబ్బంది పడొద్దని భరోసా ఇచ్చారు. కుటుంబ పెద్దను కోల్పోయిన మాకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. వచ్చిన రెండు లక్షలతో ఆయన జీవి కుదుటపడేలా ప్రశాంతంగా దనివారాలు చేశాం. ఆపదలో ఆదుకొనే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే.
– కుంచ లక్ష్మమ్మ, యాద్గార్పల్లి, (మిర్యాలగూడ రూరల్)
కేసీఆర్‌లా ఆదుకునే నాయకుడిని చూడలేదు
మా కొడుకు నరేశ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చానా కష్టపడ్డడు. ఎండనక, వాననక పార్టీ కోసం తిరిగేటోడు. అయితే.. ఇటీవల చెరువులో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతిచెందాడు. చేతికొచ్చిన కొడుకు మృతిచెందగా.. వృద్ధ వయసులో ఉన్న మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని కన్నీరుమున్నీరుగా విలపించాం. నరేశ్‌కు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండడంతో పార్టీ తరఫున రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే నోముల భగత్ అందజేశారు. కొడుకు చనిపోయిండు.. ఇక మాకెవరు దిక్కు అన్న సమయంలో ఆదుకున్న దేవుడు సీఎం కేసీఆర్ సారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునే నాయకుడిని నేనెప్పుడు చూడలేదు. కేసీఆర్ సారు సల్లంగుండాలి.
– తండు మల్లయ్య, కన్నెకల్, మాడ్గులపల్లి మండలం
బీమా సొమ్ముతో అప్పు తీర్చుకున్నాం
తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాన్నుంచి మా కుటుంబం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. దీంతో పార్టీ మా పేరున ఇన్సూరెన్స్ కట్టింది. అయితే.. 2018లో మా ఆయన బంటు చంద్రయ్య ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతిచెందాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాకు ఎమ్మెల్యే భాస్కర్‌రావు పార్టీ బీమా కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును అందించారు. ఆ డబ్బుతో కొంత అప్పు ఉంటే తీర్చుకున్నాం. కొంత ఇంటి ఖర్చులకు వాడుకున్నాం. ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేని మాకు బీఆర్ఎస్ పార్టీ బీమా కట్టి మా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నది. ఎప్పటికైనా మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతాం.
– బంటు నీలమ్మ, శెట్టిపాలెం, వేములపల్లి మండలం