నీలగిరి, ఫిబ్రవరి 14 : పోలీస్ అభ్యర్థులకు నేటి నుంచి ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులు హాల్ టికెట్లో ఉన్న సూచనలు తప్పక పాటించాలన్నారు. ఉద యం మొదట వచ్చిన వారికి టోకెన్లు జారీచేసి మెయిన్ గేట్ నుంచి లోపలికి పంపిస్తామని చెప్పారు. అడ్మిట్ కార్డు లేదా ఇంటిమేషన్ లెటర్ చూపించాలని, అనంతరం అభ్యర్థులకు వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, రిస్ట్ బాండ్ వేసిన తరువాత హోల్డింగ్ ఏరియాకు పంపిస్తామని వివరించారు. అక్కడ నుంచి ఆర్ఎఫ్ఐడీ రిజిస్ట్రేషన్ తరువాత నంబర్ ఉన్న జాకెట్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
మహిళా అభ్యర్థులకు 800 మీటర్లు, పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు క్వాలీఫై అయిన అభ్యర్థులను ఎత్తు, హైజంప్, షార్ట్‌పుట్ పూర్తయిన అభ్యర్థులను ఫైనల్ రిజల్ట్ షీట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఒక్కసారి లోపలికి వచ్చిన తరువాత ఈవెంట్స్ అయిపోయిన తరువాత మాత్రమే బయటకు అనుమతిస్తామన్నారు. అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా తగు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు అభ్యర్థులకు ట్రయల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేఆర్కే ప్రసాదరావు, డీఎస్పీలు నర్సింహారెడ్డి, రమేశ్, వెంకటగిరి, సురేశ్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, డీపీఓ సిబ్బంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టెక్నికల్ టీం సభ్యులు పాల్గొన్నారు.